Chandrababu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీపి కబురు అందించారు. సచివాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి జరిపిన సుదీర్ఘ చర్చలు విజయవంతమయ్యాయి. ఉద్యోగుల పెండింగ్ డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం, వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పలు చారిత్రాత్మక నిర్ణయాలు ప్రకటించింది. చర్చల ఫలితాలపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తూ, సీఎం చంద్రబాబు నిర్ణయాల పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఉద్యోగులకు దక్కిన ప్రధాన ప్రయోజనాలు..
-
అక్టోబర్ 1 నుంచి 2 డీఏ (DA)లు అమలు:ఉద్యోగులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న కరువు భత్యం (డీఏ) బకాయిల్లో రెండు డీఏలను అక్టోబర్ 1వ తేదీ నుంచి చెల్లించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
-
12వ పీఆర్సీ (PRC) కమిషన్ ఏర్పాటు:కొత్త పే స్కేల్ ఖరారుకు సంబంధించి ఉద్యోగుల చిరకాల కోరికైన 12వ వేతన సవరణ కమిషన్ (PRC)ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అధికారికంగా అంగీకరించింది.
-
అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్:వయోవృద్ధులైన పెన్షనర్లకు ఊరట కల్పిస్తూ, 2027 జనవరి నుంచి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వర్తింపజేయాలని నిర్ణయించారు.
లీవ్స్ నగదు బదిలీ – పోలీసులకు ప్రత్యేక నజరానా..
-
సంక్రాంతికి సరెండర్ లీవ్స్ ఎన్క్యాష్మెంట్:ఉద్యోగులకు రావాల్సిన సరెండర్ లీవ్స్ తాలూకు నగదును రాబోయే సంక్రాంతి పండుగ కానుకగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసేందుకు అంగీకారం కుదిరింది.
-
దసరాకు పోలీసులకు అదనపు లీవ్:నిరంతరం ప్రజల రక్షణలో ఉండే పోలీసుల సేవలను గుర్తించిన ప్రభుత్వం, రాబోయే దసరా పండుగ సందర్భంగా పోలీసు సిబ్బందికి ఒక అదనపు (అడిషనల్) సరెండర్ లీవ్ మంజూరు చేయడానికి ఆమోదం తెలిపింది.
రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకుని పెద్ద మనసుతో కీలక హామీలను నెరవేర్చినందుకు ఉద్యోగ సంఘాల నాయకులు సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.
