Ap news: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ఫైబర్ నెట్‌లో నియమితులైన 410 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.
జీవీ రెడ్డి మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం పాలనలో ఏపీ ఫైబర్ నెట్‌లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు రూ.1.15 కోట్లు అక్రమంగా చెల్లించారని చెప్పారు. ఈ డబ్బును తిరిగి చెల్లించేందుకు వర్మకు 15 రోజులు గడువు ఇచ్చినట్లు వివరించారు. నిర్ణీత సమయానికి డబ్బు చెల్లించకపోతే వర్మపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
అలాగే, జగన్ ప్రభుత్వం కాలంలో నిబంధనలకు విరుద్ధంగా అర్హతలేని వారిని ఏపీ ఫైబర్ నెట్‌లో ఉద్యోగులుగా నియమించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో, మొత్తం 410 మంది ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు జీవీ రెడ్డి స్పష్టం చేశారు.