Deputy CM Pawan Kalyan: రాయలసీమ గడ్డ మళ్లీ చరిత్రను రచిస్తోంది. కడపలో పసుపు వర్ణం వెల్లివిరిసింది. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ మహానాడు, టీడీపీ–జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరగడం విశేషం. దీంతో ఈ మహానాడుకు భిన్నమైన ప్రాధాన్యత ఏర్పడింది.
మహానాడు సందర్భంగా, జనసేన అధినేత మరియు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ వేడుకను “చారిత్రక రాజకీయ పండుగ”గా పేర్కొంటూ, మహానాడు పేరు వినగానే తెలుగుదేశం గుర్తుకు వస్తుందనడం ద్వారా పార్టీకి తన మద్దతును వ్యక్తపరిచారు.
“మహానాడు – ఈ పదం చదివిన వెంటనే తెలుగుదేశం పార్టీ గుర్తుకు రావడం అనేది ఆ వేడుక తెలుగువారి హృదయాల్లో ఎంతగా స్థిరపడిందో చెబుతోంది,” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, రెండు రాష్ట్రాల టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, బక్కని నరసింహులకు పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వేడుకలో చర్చించబోయే ఆరు కీలక అంశాలు — “కార్యకర్తే అధినేత”, “యువగళం”, “స్త్రీ శక్తి”, “సామాజిక న్యాయం”, “పేదల ప్రగతి”, “అన్నదాతకు అండ” — ప్రజల సంక్షేమానికి దోహదపడతాయని పవన్ అభిప్రాయపడ్డారు. ఈ అంశాలపై ప్రభావవంతమైన ప్రణాళికలు రూపొందించాలని కోరారు.
తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, “ కడపలో జరుగుతున్న ఈ మహానాడు చరిత్ర సృష్టించబోతోంది. ఇది పార్టీకి దిశ, దశను నిర్దేశించబోతున్న వేడుక” అన్నారు.
ఈ మూడు రోజుల మహానాడు రాజకీయంగా ప్రాధాన్యతతోపాటు ప్రజల ఆకాంక్షలపై దృష్టి పెట్టే ఒక బృహత్తర మంచి కార్యవేదికగా నిలవనుంది. పసుపు వర్ణంతో అలంకరించబడిన సభ ప్రాంగణం ఇప్పటికే కార్యకర్తల ఉత్సాహంతో గగ్గురుమంటోంది.