Annamalai: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే. అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నుంచి డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పాద రక్షలు ధరించబోనని ఆయన శపథం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రభుత్వ యూనివర్సిటీలో లైంగిక దాడి కేసులో డీఎంకే ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు.
ఈ కేసులో బాధితురాలి పేరు, ఫోన్ నంబర్, ఇతర వ్యక్తిగత వివరాలు బయటపడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. “ఎఫ్‌ఐఆర్ పబ్లిక్ డొమైన్‌లోకి ఎలా వచ్చింది? బాధితురాలి వివరాలు బహిర్గతం చేయడం ద్వారా ప్రభుత్వం, పోలీసుల వైఖరిని స్పష్టంగా చూపిస్తోంది. ఇది బాధితురాలి గౌరవానికి భంగం కలిగించినట్టే. దీనికి డీఎంకే ప్రభుత్వం, పోలీసులు సిగ్గుపడాలి. నిర్భయ నిధి ఎక్కడ? అన్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో సీసీటీవీ కెమెరాలు ఎందుకు లేవు?” అంటూ అన్నామలై ప్రశ్నించారు.
ఇక, డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన నిరసనలను కొనసాగిస్తూ ప్రతి శుక్రవారం తన ఇంటి ముందు ఆరు కొరడా దెబ్బలు తింటానని చెప్పారు. , అలాగే ఫిబ్రవరి రెండో వారంలో కేంద్ర మంత్రి మురుగన్‌ను కలసి రాష్ట్ర పరిస్థితులపై ఫిర్యాదు చేస్తానని చెప్పారు. వచ్చే 48 రోజులు ఉపవాస దీక్ష కొనసాగిస్తానని కూడా వెల్లడించారు.
అన్నామలై చేసిన ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.