AP Cabinet: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనుంది. అమరావతి సచివాలయంలో జరిగే ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా రాజధాని అమరావతి అభివృద్ధి పనులు, కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.
ఈ కేబినెట్ సమావేశంలో అమరావతి రాజధాని (CRDA) పరిధిలో గతంలో ఆమోదించిన పలు కీలక ప్రతిపాదనలకు ప్రభుత్వం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అలాగే, కృష్ణా నది తీరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేలా ‘మెరినా వాటర్‌ఫ్రంట్’ అభివృద్ధి కోసం భూమి కేటాయింపులపై నిర్ణయం తీసుకోనున్నారు. రాజధాని ప్రాంతంలో గతంలో కేటాయించిన 112 ఫ్లాట్ల నిర్మాణ మార్పులకు సంబంధించి కూడా మంత్రిమండలి ఆమోదముద్ర వేయనుంది.
రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఈ సమావేశంలో మరో కీలక అడుగు పడనుంది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) ఇప్పటికే పచ్చజెండా ఊపిన రూ. 19,391 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. దాదాపు 14 ప్రముఖ సంస్థలు ఈ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటికి అవసరమైన భూములను కేటాయించే అంశంపై కూడా మంత్రులు చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
ప్రభుత్వ పాలనతో పాటు రాజకీయ అంశాలపై కూడా ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మంత్రులకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా పొరుగు రాష్ట్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, దానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న కౌంటర్ల విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు.
