US – Iran War

US – Iran War: భారత్ అభివృద్ధి చేస్తున్న ‘చాబహార్ పోర్టు’పై అమెరికా బాంబుల వర్షం..

US – Iran War: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య రాత్రి నుంచి యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది. ఇరాన్‌లోని కీలక సైనిక స్థావరాలపై అమెరికా సైన్యం పెద్ద ఎత్తున మెరుపు దాడులు చేస్తోంది. ఈ క్రమంలో, అంతర్జాతీయంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న చాబహార్ ఓడరేవు (Chabahar Port)పై కూడా అమెరికా దళాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ పోర్టును భారత్ భారీ పెట్టుబడులతో, వ్యూహాత్మకంగా అభివృద్ధి చేస్తుండటం గమనార్హం. అమెరికా చేసిన ఈ మిసైల్ దాడుల వల్ల చాబహార్ పోర్టు సిటీలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అక్కడ ఉన్న కలంతారి పోర్టు, మారిటైమ్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ వంటి కీలక నిర్మాణాలు భారీగా ధ్వంసమైనట్లు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది.

చాబహార్‌తో పాటు బందర్ అబ్బాస్, బుషెహర్, క్విష్మ్ ఐలాండ్ వంటి తీరప్రాంత నగరాల్లోని ఇరాన్ సైనిక లక్ష్యాలపై అమెరికా విరుచుకుపడింది. అంతర్జాతీయ జలమార్గాల్లో వాణిజ్య నౌకల ప్రయాణాన్ని అడ్డుకుంటున్నందుకు, వాటిపై దాడులు చేస్తున్నందుకే ఇరాన్‌ను శిక్షించడానికి ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారికంగా ప్రకటించింది. మంగళవారం రాత్రి అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్‌కు చెందిన 60 యుద్ధ బోట్లు, 80 సైనిక స్థావరాలు నాశనమయ్యాయి. దీనికి ప్రతికారంగా ఇరాన్ కూడా గురువారం తెల్లవారుజాము నుంచి అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలపై ఎదురుదాడులు ప్రారంభించింది. కువైట్, బహ్రెయిన్‌లలో ఉన్న అమెరికా మిలిటరీ స్థావరాలపై ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది.

యుద్ధంలో దెబ్బతిన్న ఈ చాబహార్ పోర్టు భారత్‌కు అత్యంత కీలకమైనది. పాకిస్తాన్‌తో సంబంధం లేకుండా ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా దేశాలతో నేరుగా సరుకు రవాణా (వాణిజ్యం) చేయడం కోసం భారత్ ఈ ఓడరేవులో భారీగా పెట్టుబడులు పెట్టింది. అయితే, ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని గత కొంతకాలంగా భారత్‌పై అమెరికా ఒత్తిడి తెస్తోందనే ప్రచారం కూడా ఉంది. వచ్చే ఏడాది నాటికి భారత్ ఈ పోర్టు నుంచి తప్పుకునే యోచనలో ఉందనే వార్తల నడుమే ఈ దారుణమైన దాడి జరిగింది. ఈ పరిణామాల వల్ల ఇరు దేశాల మధ్య యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదని అంతర్జాతీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *