Pranay Murder Case: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఏళ్ల క్రితం జరిగిన పెరుమాళ్ల ప్రణయ్ పరువు హత్య కేసు మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్‌కుమార్‌కు తెలంగాణ హైకోర్టు తాజాగా షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. గత ఏడాది మార్చిలో జిల్లా కోర్టు అతనికి జీవిత ఖైదు విధించగా, ఆ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ నేపథ్యంలో ఈ ఉపశమనం లభించింది. రూ. 25 వేల వ్యక్తిగత బాండ్, మరో రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
అసలు ఏం జరిగిందంటే.. 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో తన భార్య అమృతతో కలిసి ఆసుపత్రి నుంచి వస్తున్న ప్రణయ్‌ను సుపారీ గ్యాంగ్ అత్యంత దారుణంగా హత్య చేసింది. అమృత తండ్రి మారుతీరావు, తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ ఘటన అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో పోలీసులు మొత్తం ఎనిమిది మందిని నిందితులుగా చేర్చి విచారణ జరిపారు.
ఈ కేసుపై సుదీర్ఘంగా విచారణ జరిపిన నల్గొండ జిల్లా కోర్టు, 2025 మార్చిలో కీలక తీర్పు ఇచ్చింది. ప్రణయ్‌ను నేరుగా హత్య చేసిన సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించగా, అమృత బాబాయి శ్రవణ్‌కుమార్‌తో పాటు మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధించింది. అయితే, తనపై వచ్చిన తీర్పును సవాల్ చేస్తూ శ్రవణ్‌కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. తన వయసును, ఇప్పటివరకు అనుభవించిన జైలు శిక్షను పరిగణనలోకి తీసుకోవాలని కోరడంతో, కోర్టు అతనికి మధ్యంతర బెయిల్ ఇచ్చింది.
అయితే, బెయిల్‌పై బయటకు వచ్చిన సమయంలో నిందితుడు ఎలాంటి నేరాలకు పాల్పడకూడదని, కోర్టు నిబంధనలను అతిక్రమిస్తే బెయిల్ రద్దవుతుందని హైకోర్టు హెచ్చరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు గతంలోనే ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రధాన నిందితులకు శిక్షలు పడిన దశలో, ఒక నిందితుడికి బెయిల్ రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
