Aishwarya Rai: ఫ్రెంచ్ రివియెరా వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026’ (Cannes Film Festival 2026) లో ఒక అందమైన సెలబ్రిటీ మూమెంట్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. గ్లోబల్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ బచ్చన్, హాలీవుడ్ స్టార్ నటి ఈవా లాంగోరియాలు కాన్స్ వేదికపై మళ్లీ ఒకరినొకరు కలుసుకున్నారు. ‘లారియల్’ (L’Oreal) బ్రాండ్ అంబాసిడర్లుగా వీరిద్దరి మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహబంధం ఈ వేడుకలో మరోసారి స్పష్టంగా కనిపించింది. ఇందుకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఆమె నా బెస్ట్ ఫ్రెండ్.. మేము వచ్చేశాం!
వైరల్ అవుతున్న వీడియోలో.. 51 ఏళ్ల ఈవా లాంగోరియా, 52 ఏళ్ల ఐశ్వర్య రాయ్‌తో కలిసి ఫోటోలు దిగడానికి స్టేజ్ వైపు వెళ్తుండగా ఒక సరదా సన్నివేశం చోటుచేసుకుంది. కిందకు పొడవుగా సాగి ఉన్న (లాంగ్ ట్రైల్) తన లగ్జరీ దుస్తులను సర్దుకుంటూ నడుస్తున్న ఈవా, అక్కడే ఉన్న ఐశ్వర్య వైపు చూస్తూ.. ఆమె నా బెస్ట్ ఫ్రెండ్. నేను వచ్చేసాను.. మేమిద్దరం ఇక్కడికి చేరుకున్నాం అంటూ సరదాగా కేకలు వేశారు.
ఆ తర్వాత ఐశ్వర్య రాయ్ వేచి ఉన్న వేదికపైకి వెళ్లిన ఈవా, ఆమెను ఎంతో ఆత్మీయంగా కౌగిలించుకుని పలకరించారు. ఆపై ఇద్దరూ నవ్వుతూ ముచ్చటించారు. వీరి మధ్య ఉన్న ఈ సహజమైన సాన్నిహిత్యం, పరస్పర అభిమానాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
కాన్స్ వేదికపై ఏళ్ల నాటి బంధం
చాలా ఏళ్లుగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అత్యంత గుర్తింపు పొందిన సెలబ్రిటీ స్నేహ బంధాలలో ఈవా, ఐశ్వర్యల బాండ్ ఒకటి. లారియల్ పారిస్ బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న సుదీర్ఘ అనుబంధంతో.. ఈ ఇద్దరు నటీమణులు కాన్స్ రెడ్ కార్పెట్ పైనా, వెలుపలా ప్రతి ఏడూ కలుస్తూనే ఉంటారు. ఫోటో షూట్లలో కలిసి ఫోజులు ఇవ్వడం నుండి ఈవెంట్లలో ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం వరకు.. వీరి స్నేహం ఈ ప్రతిష్టాత్మక ఫెస్టివల్లో ప్రతిసారీ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
మెర్మైడ్ లుక్‌లో ఐశ్వర్య.. తల్లికి తగ్గ కూతురిగా ఆరాధ్య!
ఈ ఏడాది కాన్స్ వేడుకల్లో ఐశ్వర్య రాయ్ తన లుక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రముఖ డిజైనర్ అమిత్ అగర్వాల్ రూపొందించిన బ్లూ కలర్ మెర్మైడ్-స్టైల్ (చేప పిల్ల ఆకృతి) గౌను ధరించి ఆమె రెడ్ కార్పెట్‌పై నడిచారు. అమిత్ అగర్వాల్‌కు ఇది కాన్స్ వేదికపై తొలి ప్రదర్శన (Cannes debut) కావడం విశేషం. ఈ లుక్కు అదనపు హంగులు అద్దడానికి ఐశ్వర్య ఒక షిమ్మరీ దుపట్టాను కూడా ధరించారు.
రెడ్ కార్పెట్ ప్రదర్శన తర్వాత, లారియల్ పారిస్ ఆధ్వర్యంలో ఉద్భవిస్తున్న మహిళా చలనచిత్ర దర్శకులను గౌరవించే వార్షిక కార్యక్రమం ‘లైట్స్ ఆన్ విమెన్స్ వర్త్’ (Lights on Women’s Worth) కు ఐశ్వర్య హాజరయ్యారు. ఈ ఈవెంట్‌కు ఆమె తన కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో కలిసి వచ్చారు. ఆరాధ్య కూడా తన తల్లికి మ్యాచ్ అయ్యేలా రూబీ-రెడ్ కలర్ గౌన్ మరియు కేప్ ధరించి ఎంతో క్యూట్‌గా మెరిసిపోయింది.
