Agniveers: 

Agniveers: అగ్నివీర్ల సర్వీస్ మరో రెండేళ్లు పొడిగింపు.. మొత్తం 6 ఏళ్లకు పెంపు.. !

Agniveers: భారత రక్షణ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ (Agnipath Scheme) పథకంలో అత్యంత కీలకమైన, మార్పు చోటుచేసుకుంది. ప్రాథమిక నాలుగేళ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత రెగ్యులర్ క్యాడర్‌కు ఎంపిక కాని మిగిలిన 75 శాతం అగ్నివీరుల సర్వీసును మరో రెండేళ్లపాటు పొడిగిస్తున్నట్లు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి బుధవారం అధికారికంగా ప్రకటించారు. దీంతో అగ్నివీరుల మొత్తం సర్వీసు కాలం నాలుగేళ్ల నుంచి ఆరేళ్లకు పెరగనుంది. సైనిక దళాల సిఫార్సుల మేరకు రూపొందించిన ఈ కీలక ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ అధికారికంగా ఆమోదముద్ర వేసినట్లు సీడీఎస్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఆరేళ్ల తర్వాత మరోసారి రెగ్యులర్ సర్వీస్ ఛాన్స్!

అగ్నిపథ్ నిబంధనల ప్రకారం ఇప్పటివరకు ఒక్కో బ్యాచ్‌లో 25 శాతం మంది అగ్నివీరులను మాత్రమే రెగ్యులర్/పర్మినెంట్ క్యాడర్‌లోకి తీసుకునేవారు. తాజా నిర్ణయంతో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి:

నాలుగేళ్ల తర్వాత రెగ్యులర్ సైన్యంలోకి ఎంపిక కాని 75 శాతం మంది అగ్నివీరులు అదనంగా మరో రెండేళ్లు (5వ, 6వ సంవత్సరం) సాయుధ దళాల్లో కొనసాగుతారు. ఈ పొడిగించిన రెండేళ్ల సర్వీసు ముగిసిన అనంతరం, వారి పనితీరు (Performance Evaluation), నిర్దేశిత అర్హత ప్రమాణాల ఆధారంగా రెగ్యులర్ సర్వీసులోకి ఎంపిక కావడానికి వారికి మరోసారి అవకాశం లభిస్తుంది. ఈ పథకం నియమనిబంధనలేవీ శిలాశాసనం కాదని, క్షేత్రస్థాయి అనుభవాలు, ఫీడ్‌బ్యాక్ ఆధారంగా నిరంతరం సమీక్షిస్తూ మార్పులు చేస్తామని సీడీఎస్ స్పష్టం చేశారు.

వేతనం, సేవా నిధి ప్యాకేజీ వివరాలు..

పొడిగించిన కాలంలో అగ్నివీరులకు అందే ప్రయోజనాలు.

పొడిగించిన మొదటి ఏడాది (5వ సంవత్సరం) నెలకు రూ. 43,500, రెండో ఏడాది (6వ సంవత్సరం) నెలకు రూ. 47,000 చొప్పున వేతనం అందుతుంది. పథకం కింద ఇచ్చే ముగింపు ప్యాకేజీ ‘సేవా నిధి’ యథావిధిగా కొనసాగుతుంది. సర్వీసు పొడిగింపు ఆధారంగా ఇతర అలవెన్సులు, విధులకు సంబంధించిన విధివిధానాలు త్వరలోనే విడుదలవుతాయి.

శిక్షణ కేవలం శారీరక దృఢత్వానికే పరిమితం కాకుండా.. టెక్నాలజీ, నైపుణ్యాల పెంపుతో పాటు పదో తరగతి నుంచి ఇంటర్‌కు, ఇంటర్ నుంచి గ్రాడ్యుయేషన్‌కు విద్యార్హతలు పెంచుకునే వెసులుబాటును కల్పిస్తున్నారు.

నవంబర్, డిసెంబర్లలో ముగియనున్న తొలి బ్యాచ్ సర్వీస్!

2022 జూన్‌లో ప్రారంభమైన అగ్నిపథ్ పథకం తొలి బ్యాచ్ నాలుగేళ్ల గడువు ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది.

  • నేవీ అగ్నివీర్ల తొలి బ్యాచ్: నవంబర్ 21న సర్వీస్ పూర్తి చేసుకోనుంది.

  • ఎయిర్‌ఫోర్స్ బ్యాచ్: డిసెంబర్ 21 నాటికి పూర్తవుతుంది.

  • ఆర్మీ తొలి బ్యాచ్: డిసెంబర్ 31 నాటికి పూర్తి కానుంది.

  • 2026 చివరి నాటికి మొదటి బ్యాచ్‌కు చెందిన దాదాపు 18,000 మందికి పైగా అగ్నివీరులు నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకోనున్నారు.

తొలి బ్యాచ్ పనితీరుపై రక్షణ శాఖకు అత్యంత సానుకూలమైన నివేదికలు వచ్చాయని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో, కొత్త బాధ్యతలను స్వీకరించడంలో అగ్నివీరులు విశేష ప్రతిభ చూపారని జనరల్ రాజా సుబ్రమణి ప్రశంసించారు. తొలి బ్యాచ్ పదవీ విరమణ ముంగిట సర్వీసును మరో రెండేళ్లు పొడిగిస్తూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం అగ్నివీర్ యువతకు, వారి కుటుంబాలకు భారీ ఊరటనిచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *