Revanth Reddy

Revanth Reddy: సదర్ అంటే తెలంగాణ ఆత్మగౌరవం..!

Revanth Reddy: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో బుధవారం (నవంబర్ 4న) శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సదర్ కేవలం యాదవ సోదరుల పండుగ మాత్రమే కాదని, తెలంగాణ ప్రజలందరి ఆత్మగౌరవ సమ్మేళనమని కొనియాడారు. యాదవులు కోరగానే తమ ప్రజా ప్రభుత్వం సదర్‌ను అధికారికంగా రాష్ట్ర పండుగగా గుర్తించిందని, యాదవ సోదరుల ఆత్మగౌరవానికి ఎక్కడా లోటు రాకుండా చూసుకునే పూర్తి బాధ్యత తమ ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.

గోల్కొండ ఒకనాటి గొల్లంకొండ.. నగరాభివృద్ధిలో యాదవులే కీలకం

హైదరాబాద్ నగర చరిత్ర, అభివృద్ధిలో యాదవుల పాత్రను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. గోల్కొండ కోట గతంలో ‘గొల్లంకొండ’ అని గుర్తుచేశారు. కాకతీయ రాజవంశం కాలం నుంచి నేటి ఆధునిక నగరం వరకు భాగ్యనగర ఎదుగుదలలో యాదవ రాజులు, యాదవ సోదరుల సేవలు మరవరానివని ప్రశంసించారు.

విద్య, ఉద్యోగాలు, వ్యాపారాల కోసం దేశం నలుమూలల నుంచి నగరానికి వచ్చిన ప్రతి ఒక్కరినీ అక్కున చేర్చుకుని ఆదరించిన ఘనత నగర యాదవులకే దక్కుతుందన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా సదర్ వేడుకను రాష్ట్ర పండుగగా గుర్తించాలనే ఆలోచన చేయలేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవించి రూ. 5 కోట్ల నిధులను మంజూరు చేసిందని వివరించారు.

మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీకి సహకరించాలి..

తెలంగాణను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం పునరుద్ఘాటించారు. మూసీ నది సమగ్ర పునరుజ్జీవం, మెట్రో రైలు రెండో దశ విస్తరణ, ప్రతిష్ఠాత్మక ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ నిర్మాణ ప్రాజెక్టులను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ఈ భారీ ప్రజా ప్రాజెక్టుల విజయవంతానికి యాదవ సోదరుల సంపూర్ణ సహకారం ఉండాలని కోరారు.

కులగణన దేశానికే ఆదర్శం.. పదవుల్లో సముచిత స్థానం..

సామాజిక న్యాయం అందించడంలో ప్రభుత్వం ముందంజలో ఉందని సీఎం పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే (కులగణన) నిర్వహించామని, రాష్ట్ర మోడల్‌ను యావత్ దేశం అనుసరించేలా దీనిని పారదర్శకంగా చేపట్టామని చెప్పారు.

ప్రజా ప్రభుత్వంలో యాదవులకు సముచిత రాజకీయ ప్రాధాన్యం కల్పించామని వెల్లడించారు. అనిల్ కుమార్ యాదవ్‌ను రాజ్యసభకు పంపించామని గుర్తుచేశారు. అలాగే నవీన్ యాదవ్‌ను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామని తెలిపారు. ఈశ్వరమ్మ యాదవ్‌ను ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా నియమించామన్నారు.

యాదగిరిగుట్ట గోశాలలో గోసంరక్షణను శాస్త్రీయంగా చేపట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, భవిష్యత్తులో యాదవులకు దక్కాల్సిన న్యాయమైన వాటా తప్పకుండా దక్కేలా చూస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా తన కాలేజీ రోజుల నుంచే దీపావళి వేళ సదర్ వేడుకల వైభవాన్ని, ఎద్దుల విన్యాసాలను ఎంతో ఆసక్తిగా చూసేవాడినని సీఎం గుర్తుచేసుకున్నారు. జాతీయ నేతలు తేజస్వి యాదవ్, ధర్మేంద్ర యాదవ్ సహా వేడుకను విజయవంతంగా నిర్వహించిన స్థానిక యాదవ ప్రముఖులకు ఆయన అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *