Crime News

Crime News: మిస్సింగ్ కేసుగా మొదలైంది.. చివరికి బంగారం కోసం హత్య చేసినట్టు తేలింది..!

Crime News: రోజురోజుకి పెరుగుతున్న బంగారం ధరలతో సామాన్యుడికి అందనంత దూరం వెళ్ళిపోయింది. దీంతో కొందరు దీన్నే అదునుగా తీసుకొని బంగారం కోసం వృద్ధులను టార్గెట్ చేసుకొని హత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా హైదరాబాద్ లో జరిగింది.

మిస్సింగ్ కేసుగా మొదలై హత్య కేసుగా ముగిసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లాపూర్ బాబానగర్ ప్రాంతంలో సుజాత(65) తన సొంత ఇంటిలో ఒంటరిగా నివాసం ఉంటుంది. ఆమె ఇంట్లోకి అద్దెకు దిగాడు కోనసీమ జిల్లా పేరవలి మండలం కొత్తపల్లికి చెందిన ఎం.అంజిబాబు(33) అనే క్యాబ్ డ్రైవర్. కొంత కాలం బాగానే గడిచినప్పటికీ.. ఎలా చూశాడో తెలీదు గాని సుజాత దగ్గర ఉన్న బంగారాన్ని చూశాడు. అప్పటినుండి ఆ బంగారాన్ని ఎలాగైనా కొట్టేయాలని నిర్ణయించుకున్నాడు. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటుందని, ఆమెను చూడడానికి ఎవరూ కూడా వచ్చే వారు లేకపోవడంతో ఇంట్లోకి చొరబడి ఆమెను హత్య చేసి బంగారాన్ని దోచుకున్నాడు.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy: కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి!

క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న సుజాత సోదరి ఆమె ఇంటికి వచ్చింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అనుమానం వచ్చి నాచారం పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేసింది. పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఆమె కోసం వెతుకుతున్న సమయంలో సుజాత ఇంట్లో అద్దెకు ఉండే అంజిబాబు కూడా కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు ముందుగా అతని కోసం వెతకడం మొదలు పెట్టారు. అంజిబాబుని పట్టుకున్న తర్వాత పోలీసులు తమదైన స్టైల్ లో అతడిని విచారించగా.. బంగారం కోసమే ఆమెను హత్య చేసినట్లు తెలిపాడు. ఆమె మృతదేహాన్ని స్నేహితులు యువరాజు(18), దుర్గారావు(35) సహాయంతో కోనసీమ జిల్లా కృష్ణలంకకు తరలించి గోదావరిలో పడేశానని అంజిబాబు నేరం అంగీకరించాడు. నిజం ఒప్పుకోవడంతో హత్య చేసిన అంజిబాబును, మృతదేహాన్ని మాయం చేయడానికి సహాయం చేసిన అతని స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

బంగారం కోసం, డబ్బుల కోసం హత్యలు చేస్తున్నారు బాగానే ఉంది. కానీ ఎప్పటికైనా పోలీసులకు దొరుకుతాం అని నిందితులు మర్చిపోతున్నారు. దోచుకున్న డబ్బులతో నెల రోజులు ఎంజాయ్ చేస్తారేమో.. కానీ ఎప్పుడెప్పుడు పోలీసులు పట్టుకుంటారేమో అనే భయం మాత్రం ప్రతి నిమిషం ఉంటుంది. పోలీసులకు దొరికిన తర్వాత జైలుకు వెళ్లి అక్కడ చపట్టి భోజనం చేస్తూ, కొట్టినా తిట్టినా చస్తూ బతకడం కంటే.. ప్రశాంతంగా పని చేసుకుంటూ వచ్చిన డబ్బులతో ఖర్చులు తగ్గించుకొని, కొంత వెనకాల వేసుకొని ఉన్నదాంట్లో బతకడం నేర్చుకుంటే ఏదో ఒకరోజు ఆ బంగారం తామే కొనుక్కోవచ్చుగా!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *