Telangana:

Telangana: తెలంగాణలో మ‌రో రెండు ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధం!

Telangana: తెలంగాణ రాష్ట్రంలో మ‌రో ఎన్నిక‌ల స‌మ‌రానికి రంగం సిద్ధ‌మైంది. డిసెంబ‌ర్ నెల‌లోనే పంచాయ‌తీ ఎన్నిక‌లు ముగియ‌డంతోపాటు పాల‌క‌వ‌ర్గాలు కొలువుదీరాయి. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అత్య‌ధిక స్థానాల‌ను కైవసం చేసుకున్న‌ది. ఆ త‌ర్వాత ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ ఎక్కువ స్థానాల‌ను గెలుచుకున్న‌ది. దీంతో గెలుపు ధీమాతో అధికార పార్టీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు ముందుకొచ్చింది. ఈ మేర‌కు తొలుత‌ ఓట‌రు జాబితాల స‌వ‌ర‌ణ‌పై దృష్టి పెట్టింది.

Telangana: రాష్ట్రంలో మున్సిప‌ల్, కార్పొరేష‌న్ స్థానాల ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌భుత్వం ఇచ్చిన గ్రీన్‌సిగ్న‌ల్‌తో ఎన్నిక‌ల సంఘం సిద్ధ‌మ‌వుతున్న‌ది. ఈ మేర‌కు రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేష‌న్ల‌లో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించింది. కరీంన‌గ‌ర్‌, నిజామాబాద్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, కొత్త‌గూడెం, రామ‌గుండం, మంచిర్యాల మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల‌కు ఈ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఫిబ్ర‌వ‌రిలో ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు అంతా సిద్ధం చేస్తున్న‌ట్టు తెలుస్తున్న‌ది.

Telangana: రాష్ట్ర‌వ్యాప్తంగా ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్న‌ మున్సిప‌ల్‌, కార్పొరేష‌న్ స్థానాల్లో ఓట‌ర్ల స‌వ‌ర‌ణ జాబితా సిద్ధం చేయాల‌ని ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. డిసెంబ‌ర్ 30 నుంచే ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ ప్రారంభం కానున్న‌ది. ఈ జాబితాను అనుస‌రించి రాజ‌కీయ పార్టీల నుంచి అభ్యంత‌రాల‌ను స్వీక‌రిస్తారు. ఆ అభ్యంత‌రాల ప‌రిశీల‌న అనంత‌రం 2026 జ‌న‌వ‌రి 10న తుది జాబితాను విడుద‌ల చేస్తారు.

Telangana: ఇదిలా ఉండ‌గా, ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల‌కు కూడా క‌స‌ర‌త్తు జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ది. స్థానిక ఎన్నిక‌ల్లో 42 శాతం బీసీ రిజ‌ర్వేష‌న్ల అమ‌లు కోసం ప్ర‌భుత్వం స‌న్నాహ‌కాలు చేయ‌నున్న‌ది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అసెంబ్లీ స‌మావేశాల్లో ఆ రిజ‌ర్వేష‌న్ల అంశంపై చ‌ర్చించ‌నున్న‌ట్టు సీఎం రేవంత్‌రెడ్డి, ఇత‌ర మంత్రులు ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో అసెంబ్లీ స‌మావేశాల్లో రిజ‌ర్వేష‌న్ల అంశం తేలితే మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌తో పాటు ప్రాదేశిక ఎన్నిక‌లు కూడా ఫిబ్ర‌వ‌రి నెల‌లోనే పూర్త‌య్యే అవ‌కాశం ఉన్న‌ద‌ని తెలుస్తున్న‌ది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *