Seethakka: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. అధికారంలో లేని బీఆర్ఎస్ పార్టీ ‘దీక్షా దివాస్’ పేరుతో పది రోజుల కార్యక్రమం ప్రకటించడంపై రాష్ట్ర మంత్రి సీతక్క గట్టి కౌంటర్ ఇచ్చారు. నాంపల్లిలో మీడియాతో మాట్లాడిన సీతక్క, బీఆర్ఎస్ వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
అధికారంలో ఉన్నప్పుడు ఒకే రోజు, ఇప్పుడేమో పది రోజులా?
సీతక్క మాట్లాడుతూ, బీఆర్ఎస్ అధికారం వెలగబెట్టినప్పుడు కేవలం ఒక్క రోజు మాత్రమే ‘దీక్షా దివస్’ నిర్వహించేవారని గుర్తు చేశారు. “అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఏమీ లేదు. అందుకే ఆ దీక్షను ఒక్క రోజుకే పరిమితం చేశారు,” అని ఆమె వ్యంగ్యంగా అన్నారు. కానీ, ఇప్పుడు అధికారం పోయిన తర్వాత, పది రోజుల పాటు ‘దీక్షా దివస్’ పేరుతో నాటకాలు ఆడాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆమె సూటిగా ప్రశ్నించారు. ప్రజలను మోసం చేయడానికే, తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికే ఈ పది రోజుల డ్రామా అని సీతక్క ఆరోపించారు.
పదేళ్ల అభివృద్ధి చెప్పాలి!
బీఆర్ఎస్ నాయకులు ముందుగా తాము పదేళ్ల పాలనలో ప్రజలకు చేసిన అభివృద్ధి ఏంటో ఈ దీక్షా దివస్లో చెప్పాలని మంత్రి సీతక్క సవాల్ విసిరారు. మరోవైపు, తమ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండు సంవత్సరాల్లోనే ప్రజల కోసం ఎంతో చేసిందని, ఆ విజయాలను వివరించడానికి తాము పది రోజుల కార్యక్రమాలు చేపడుతున్నామని ఆమె తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను, విజయాలను ప్రజల్లోకి వెళ్లనీయకుండా అడ్డుకునే కుట్రతోనే బీఆర్ఎస్ ఈ ‘దీక్షా దివస్’ నాటకాలను ఆడుతోందని ఆమె మండిపడ్డారు.
కేసీఆర్ కుటుంబానికే ఎక్కువ లాభం!
తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష అనేది దశాబ్దాల కల అని గుర్తుచేసిన సీతక్క, కేసీఆర్ దీక్ష వెనుక ఉన్న నిజం నిమ్మరసానికి తెలుసు అంటూ పాత విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, వందల రెట్లు లాభపడింది కేసీఆర్ కుటుంబమే అని ఆమె ఘాటుగా విమర్శించారు. బీఆర్ఎస్ నాయకుల దగ్గర కేవలం అధికారం మాత్రమే పోయిందని, దోచుకున్న కోట్లాది రూపాయలు ఇంకా ఉన్నాయని, అందుకే వారు ఎన్ని కార్యక్రమాలైనా చేయగలుగుతున్నారని ఆమె దుయ్యబట్టారు.
చివరగా, “అధికారం ఉంటేనే ప్రజల్లో ఉంటాం, లేకపోతే బయటికి రాము” అనే విధంగా బీఆర్ఎస్ నేతలు ప్రవర్తిస్తున్నారని సీతక్క విమర్శించారు. ‘దీక్షా దివస్’ పేరుతో బీఆర్ఎస్ చేస్తున్న ఈ డ్రామాలను తెలంగాణ ప్రజలు అస్సలు నమ్మరు అని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
