Encounter

Encounter: ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో సహా ఆరుగురు మృతి

Encounter: దక్షిణ భారతదేశంలో మావోయిస్టు ఉద్యమానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి టైగర్ జోన్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఉదయం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో మోస్ట్ వాంటెడ్, మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అయిన అగ్రనేత మద్వి హిడ్మా కూడా ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అధికారికంగా ధృవీకరించారు.

మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఆరుగురిలో, హిడ్మాతో పాటు అతని భార్య హేమ (రాజీ), స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు చెల్లూరి నారాయణరావు అలియాస్ జాంబ్రీ వంటి కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. సుక్మా జిల్లా పూర్వాటి గ్రామానికి చెందిన హిడ్మా, మావోయిస్టు పార్టీలో గెరిల్లా దాడులకు ముఖ్య వ్యూహకర్తగా పేరుపొందాడు. పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్‌గా పనిచేసిన ఇతను 25 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్ళాడు. 2017లో 25 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్ల మృతికి కారణమైన దాడి వెనుక హిడ్మా ప్రధాన పాత్ర ఉంది. హిడ్మా తలపై రూ. కోటికి పైగా, అతని భార్య హేమపై రూ. 50 లక్షల రివార్డు ఉంది. ‘ఆపరేషన్ కగార్’ తీవ్రతరం కావడంతో ఛత్తీస్‌గఢ్ నుంచి హిడ్మా బృందం మారేడుమిల్లి వైపు వచ్చిందనే సమాచారంతోనే పోలీసులు కూంబింగ్ చేపట్టారు.

Also Read: Harbhajan Singh: టెస్ట్ క్రికెట్‌ను పూర్తిగా నాశనం చేశారు.. హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు పెరిగాయనే పక్కా సమాచారంతోనే స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు ఈ భారీ కూంబింగ్ ఆపరేషన్‌ను చేపట్టాయి. ఎదురుకాల్పుల అనంతరం, ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, మిగిలిన మావోయిస్టుల కోసం, ఆయుధాలు, పేలుడు పదార్థాలు వంటి సామాగ్రిని స్వాధీనం చేసుకోవడం కోసం భద్రతా బలగాలు ఇంకా తీవ్రంగా గాలిస్తున్నాయి. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, ఈ ఆపరేషన్ విజయవంతమైందని, భద్రతా చర్యలను మరింత బలోపేతం చేశామని తెలిపారు. శాంతి భద్రతల దృష్ట్యా ప్రజలు అడవుల్లోకి వెళ్లవద్దని, అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి కేంద్ర హోం శాఖ అధికారులు కూడా సమాచారాన్ని సేకరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *