Jagan Tenali Tour: తెనాలి ఐతా నగర్‌లో మంగళవారం భయానక పరిస్థితుల్ని చూశారు అక్కడి ప్రజలు. స్థానికంగా ఉన్న రౌడీ షీటర్ జాన్ విక్టర్‌ని పరామర్శించడానికి వచ్చారు అతని అభిమాన నాయకుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి. వందలు, మందలుగా వైసీపీ శ్రేణులు ఐతా నగర్‌కు చేరుకుని అరుపులు, కేకలతో ఆ ప్రాంత వాసుల్ని వాసుల్ని భయాందోళనకు గురిచేశారు. ఒక రౌడీ షీటర్, గంజాయ్ బ్యాచ్‌లో మెంబర్, అనేక నేరాలకు పాల్పడిన అతడి కోసం.. వందలాదిగా వైసీపీ కార్యకర్తలు, ఆ పార్టీ అధినాయకుడు తరలి రావడంతో ఐతా నగర్‌తో పాటు తెనాలి ప్రజలంతా భయాందోళనలకు గురయ్యారు. మొత్తానికి తాను అనుకున్నది సాధించారు జగన్. రౌడీ మూకలకు, అరాచక శక్తులకు, గంజాయి సేవించి నేరాలకు పాల్పడే వారికి.. తన అండదండలు ఎప్పుడూ ఉంటాయని ఒక భరోసా అయితే కల్పించారని అంటున్నారు పరిశీలకులు.
జగన్ పరామర్శిన రౌడీ షీటర్ పేరు జాన్ విక్టర్. ఇతనితో కలిపి రాకేష్, కరీముల్లా.. అనే మరో ఇద్దరికి ఇటీవల పబ్లిక్‌గా అరికాలి కోటింగ్ ఇచ్చారు తెనాలి పోలీసులు. వైసీపీ కోణంలో ఈ ముగ్గురు బాధితులు. కానీ సమాజం దృష్టిలో, కామన్‌సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరి దృష్టిలో వీరు అరాచక శక్తులు. వీరేంటో, వీరు చేసే పనులేంటో, వీరి మీద ఉన్న కేసులేంటో ఐతా నగర్ వాసులతో పాటూ తెనాలి ప్రజలకు ముందు నుండీ బాగా తెలుసు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం తెలుసు. అలాంటి రౌడీ షీటర్ల కోసం తన మందనేసుకుని జగన్ తెనాలి రావడం ప్రజల్ని భయాందోళనలకు గురిచేసింది. ఆ క్రిమినల్స్ కిరాతకాలకు తాము బాధితులమని, అప్పుడు మమ్మల్ని పరామర్శించడానికి రాని జగన్… ఇప్పుడు ఆ నేరగాళ్ళను ఓదార్చడానికి రావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
Also Read: Allu Arjun: ఆర్సీబీ విజయం.. అల్లు అయాన్ సెలబ్రేషన్స్ చూశారా.. ?
Jagan Tenali Tour: గత వైసీపీ పాలనలో రాష్ట్రంలో అడుగడుగునా గంజాయి బ్యాచ్‌లు పుట్టుకొచ్చాయి. గత ఐదేళ్లలో గంజాయి వాడకం ఎంతలా పెరిగిపోయిందో అధికారిక లెక్కలు చూస్తే తెలుస్తుంది. దేశంలో గంజాయి ఎక్కడ పట్టుబడినా మూలాలు ఏపీలోనే కనబడేవి. అలా.. రాష్ట్రంలో గంజాయి బ్యాచ్‌లను తయారు చేసింది మేమేనని, వాళ్లని కాపాడుకునేది కూడా తామేనని నేడు జగన్ మెసేజ్ ఇచ్చినట్లైంది.
నిజానికి ఆ ముగ్గురికి అరికాలి కోటింగ్ ఇవ్వడం అనేది ఏమంత పెద్ద వ్యవహారం కాదు. కొట్టింది రౌడీ షీటర్లని. స్కూల్లో విద్యార్థులను క్రమ శిక్షణలో పెట్టేందుకు టీచర్లు బెత్తం పడతారు. సమాజంలో అదుపు తప్పుతున్న ఇలాంటి వారిని క్రమ శిక్షణలో పెట్టేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. కాకపోతే.. అలా బహిరంగంగా శిక్షించే హక్కు చట్టప్రకారం పోలీసులకు లేదు. సాధారణంగా నేరస్తులపై పోలీసులు ప్రయోగించే థర్డ్ డిగ్రీని కూడా న్యాయస్థానాలు మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణిస్తాయి. కనీసం ఈ లాపాయింట్ కూడా జగన్ స్పష్టంగా చెప్పలేకపోవడం గమనార్హం. గతంలో వారిపై ఏ కేసులుంటే నాకేంటి, ఏ నేరాలు చేస్తే నాకేంటి… పోలీసులు వారిని కొట్టడం ముమ్మాటికీ తప్పే అంటూ మాట్లాడారు జగన్‌మోహన్‌రెడ్డి.
జగన్ లేవనెత్తిన మరో అంశం ఏంటంటే… మంగళగిరికి చెందిన యువకుల్ని తీసుకొచ్చి.. తెనాలిలో కొట్టారంటూ ఆరోపిస్తున్నారాయన. అయితే నీ పర్యటన ఏదో మంగళగిరిలో పెట్టుకుని నీ గంజాయ్ బ్యాచ్‌ని అక్కడే పరామర్శించకుండా తెనాలికి ఎందుకు వచ్చావ్ అంటూ జగన్‌ని ప్రశ్నిస్తున్నారు తెనాలి ప్రజలు.
Also Read: AP June 4th Special: సమరమా? సంబరమా? ‘జూన్ 4’ పైచేయి ఎవరిది?
Jagan Tenali Tour: జగన్ స్పీచ్‌లో పస లేదు. ఆయన పట్టుకొచ్చిన స్క్రిప్ట్‌లో మ్యాటర్ లేదని మరో విషయం గమనిస్తే అర్థమౌతుంది. పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్న రౌడీ షీటర్ల అరికాళ్లకి బొబ్బలొచ్చాయనీ, ఇదెక్కి దారుణమని, అభం శుభం తెలీని చిన్న పిల్లోళ్లను పట్టుకుని లాఠీతో కొడతారా అని నెత్తీ నోరు బాదుకున్నారు జగన్ మోహన్ రెడ్డి. అయితే ఇదే జగన్ సీఎంగా ఉన్నప్పుడు బాపట్ల జిల్లా ఉప్పలవారి పాలెంలో బడికి వెళ్తున్న 14 ఏళ్ల అమర్నాథ్ గౌడ్‌ని పేపర్లు నోట్లో కుక్కి, సజీవదహనం చేశారు రౌడీ మూకలు. వీరిలో వైసీపీ కార్యకర్తలు కూడా ఉన్నారని వార్తలొచ్చాయ్. రౌడీ షీటర్ల అరికారి బొబ్బలకే గగ్గోలు పెడుతున్న జగన్.. చిన్నారి అమర్నాథ్ గౌడ్‌ని నిలువునా తగలబెట్టి చంపితే ఒక్క మాట మాట్లాడలేదు.
మొత్తానికి రౌడీ షీటర్లని, గంజాయి బ్యాచ్‌ని పరామర్శించడానికి తెనాలికి వచ్చిన జగన్ పర్యటన ఒక పేలవమైన పొలిటికల్ షోలా మిగిలిపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు తిరిగి, ఇటు తిరిగి.. చివరికి రెడ్‌బుక్ దగ్గరికి వచ్చి ఆగారు జగన్ మోహన్‌రెడ్డి. రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్‌లు, బ్లేడ్ బ్యాచ్‌లు, లంపెన్ ఎలిమెంట్స్‌కు తోలు వలిచి, అరికాలి ట్రీట్మెంట్ ఇవ్వడమే రెడ్‌బుక్ రాజ్యాంగం అయితే… సగటు ప్రజలు కోరుకునేది కూడా అలాంటి రాజ్యాంగమేనని పాపం జగన్ మోహన్‌రెడ్డికి తెలిసినట్లు లేదు. ఆయన పక్కనున్నోళ్లు తెలిసినా చెప్పరు కాబోలు.
Also Read: Chandrababu: ఏపీ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు ఇది..
Jagan Tenali Tour: ఇక జగన్ పర్యటనపై తీవ్రంగా స్పందిస్తున్నాయి ప్రజా, దళిత సంఘాలు. పోలీసుల చేతిలో అరికాలి కోటింగ్ తీసుకున్న యువకులు తెనాలిలో పేరుమోసిన రౌడీ షీటర్ లడ్డూ గ్యాంగ్‌లో అనుచరులని చెబుతున్నారు అక్కడి దళిత నేతలు. జగన్ పర్యటనకు వ్యతిరేకంగా తెనాలి మార్కెట్ సెంటర్లో దళిత, ప్రజా సంఘాల రాస్తారోకో చేపట్టారు. వైసీపీ హయాంలో దారుణంగా హత్యకు గురైన దళిత యువకుడు నూతక్కి కిరణ్‌ని పొట్టనబెట్టుకుంది ఈ లడ్డూ గ్యాంగే అన్న ఆరోపణలున్నాయి. హత్య చేసి డెడ్ బాడీని కూడా మాయం చేశారు. నాలుగేళ్లవుతున్నా కిరణ్ డెడ్‌బాడీ నేటికీ లభ్యం కాలేదు. అలాంటి కిరాతక బ్యాచ్‌లో సభ్యులుగా ఉన్నవారిని జగన్ పరామర్శించడంపై.. తెనాలి దళిత, ప్రజా సంఘాల నేతలు ఏమంటున్నారో.. వారి మాటల్లోనే వినండి..
వైసీపీని సైకో పార్టీగా పిలుస్తుంటారు టీడీపీ, జనసేన నేతలు. తాజా పరిణామాలు చూస్తుంటే.. అలా పిలవడంలో తప్పులేదని న్యూట్రల్ వర్గాల్లో కూడా అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ ఈ పరామర్శకి వెళ్లడం ఆ పార్టీలోనే చాలా మంది నేతలకు ఇష్టం లేదట. అయితే వెళితే ఓ వర్గం ఓటర్లని ఆకర్షించొచ్చని జగన్‌కి ఎవరో సలహా ఇచ్చినట్లున్నారు. అలా జగన్‌ని పరామర్శకి ఉసిగొల్పినోళ్లు ఎవరో కానీ… అన్నపై కోపమైనా ఉండాలి.. లేదంటే వైసీపీ పార్టీపై కన్నేసి ఉండాలి.. అంటూ చర్చించుకుంటున్నారట కాస్తో కూస్తో ఆలోచన చేయగలిగే వైసీపీ కార్యకర్తలు.