KCR

KCR: తెలంగాణ ఆగమైతుంటే చూడలేకపోతున్నా.. నా గుండె తరుక్కుపోతోంది!

KCR: బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో జరిగిన వేడుకల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆయన ఆరోపించారు. ఒకప్పుడు వ్యవసాయం, ఇతర రంగాల్లో తెలంగాణను తాము నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టామని, కానీ నేడు ఈ ప్రభుత్వం భూముల కబ్జాల్లో, కూలగొట్టడాల్లో నెంబర్ వన్‌గా నిలుస్తోందని కేసీఆర్ ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును కేసీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. రైతులు పండించిన పంటను కొనేందుకు కూడా మంత్రివర్గం చర్చలు జరపాలా అని ప్రశ్నించారు. నేరుగా కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతుంటే, వారి పరిస్థితి చూసి తన గుండె తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలన వల్ల రాష్ట్రం మళ్ళీ పాత రోజుల్లోకి, అంటే తెలంగాణ ఏర్పడక ముందున్న కరువు పరిస్థితుల్లోకి వెళ్లిపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

మిషన్ భగీరథ వంటి గొప్ప పథకాన్ని కూడా సక్రమంగా నడపడం ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదని కేసీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రులు సమస్యల గురించి మాట్లాడకుండా చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, వారిని చూస్తుంటే జాలి వేస్తోందని అన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని బంధించిన మూర్ఖపు ప్రభుత్వం ఇదని ఘాటుగా విమర్శిస్తూ.. ప్రజల సమస్యలపై అసెంబ్లీ లోపల, బయట బీఆర్‌ఎస్ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.

తెలంగాణ ఉద్యమ కాలం నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. హైదరాబాద్ విషయంలో తాను ఎప్పుడూ రాజీపడలేదని కేసీఆర్ మరోసారి నొక్కి చెప్పారు. హైదరాబాద్ లేకుండా తెలంగాణ తీసుకోవాలని సోనియా గాంధీ స్వయంగా కోరినా, తలవంచకుండా పోరాడి హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను సాధించామని పేర్కొన్నారు. 2009లో చంద్రబాబుతో ‘జై తెలంగాణ’ అనిపించేందుకే అప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని వెల్లడించారు. ఎన్నో అవమానాలు, మానసిక క్షోభను భరించి రాష్ట్రాన్ని సాధించామని, అటువంటి తెలంగాణ నేడు సంక్షోభంలో పడటం బాధాకరమని కేసీఆర్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *