Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఆ పార్టీకి ఘనమైన గతం ఉండొచ్చు కానీ, భవిష్యత్తు మాత్రం శూన్యమని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ మాటలను ప్రజలు భరించారని, అధికారంలో ఉన్న పదేళ్లు కూడా అదే ధోరణి కొనసాగించారని రేవంత్ విమర్శించారు. అయితే ప్రస్తుతం కేసీఆర్ కుటుంబానికి, ఆ పార్టీకి ప్రజలతో ఎలాంటి సంబంధాలు లేవని ఆయన స్పష్టం చేశారు.
కేసీఆర్ కుమార్తె కవిత కొత్త పార్టీ పెడతారనే ప్రచారంపై స్పందిస్తూ, ఇదంతా కేసీఆర్ కుటుంబం ఆడుతున్న నాటకమని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆ కుటుంబమంతా ఒక్కటేనని, ప్రజలను మభ్యపెట్టడానికే ఇలాంటి ప్రదర్శనలు ఇస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ప్రస్తావిస్తూ.. ఆయన ఆరోగ్యంగా ఉండాలని తాము కోరుకుంటున్నామని, ఆయన బాగుంటేనే తమకు రాజకీయంగా మంచిదని చమత్కరించారు. తమ ప్రభుత్వం వివక్ష లేని పాలన అందిస్తోందని, ప్రస్తుతం తమకు అసలు ప్రతిపక్షమే లేని పరిస్థితి నెలకొందని ధీమా వ్యక్తం చేశారు.
ఇక రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై కూడా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను హైకోర్టు తప్పుపట్టలేదని, కేవలం సాంకేతిక కారణాల గురించే కోర్టు మాట్లాడిందని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ పూర్తయిన తర్వాతే అసలైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. బాధ్యులెవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని, చట్టపరంగా ముందుకు వెళ్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
