Petrol-Diesel

Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ కొరతపై సివిల్ సప్లై కమిషనర్ కీలక ప్రకటన

Petrol-Diesel: తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే వార్తలు వినియోగదారులను కలవరపెడుతున్నాయి. మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ముడి చమురు సరఫరా ఆగిపోతుందనే ప్రచారంతో వాహనదారులు బంకుల వద్ద క్యూ కడుతున్నారు. ముఖ్యంగా మేడ్చల్, శామీర్‌పేట వంటి ప్రాంతాల్లోని కొన్ని బంకుల్లో “నో స్టాక్” బోర్డులు కనిపించడంతో సామాన్య ప్రజలు, రవాణా రంగం వారు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ప్రభుత్వం స్పందించింది.

రాష్ట్రంలో ఇంధన నిల్వలపై వస్తున్న వార్తలపై సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టతనిచ్చారు. తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత ఏమీ లేదని, ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. డిమాండ్‌కు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని ఆయన హామీ ఇచ్చారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల అక్కడక్కడ బంకులు మూసి ఉన్నా, వెంటనే అవి పునరుద్ధరించబడతాయని కమిషనర్ తెలిపారు.

పక్క రాష్ట్రాల్లో ఇంధన కొరత ఉండటం వల్ల సరిహద్దు జిల్లాల ప్రజలు మన రాష్ట్రంలోని బంకులకు భారీగా తరలివస్తున్నారని, దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో రద్దీ పెరిగిందని అధికారులు గుర్తించారు. దీని ప్రభావం మేడ్చల్ పరిసర ప్రాంతాల్లోని డీజిల్ సరఫరాపై కాస్త పడిందని, అయితే పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వారు పేర్కొన్నారు. వాహనదారులు అనవసరంగా కంగారు పడి పెట్రోల్ బంకుల వద్ద గుమిగూడ వద్దని, సాధారణంగానే ఇంధనం అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *