KTR: సంస్థాగతంగా మరింత బలోపేతం అయ్యే దిశగా గులాబీ దళం ప్రణాళికలు రచిస్తోంది. దేశంలో పటిష్ఠంగా ఉన్న ప్రాంతీయ పార్టీల విధానాలను అధ్యయనం చేసిన గులాబీ పార్టీ, సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇందుకోసం రానున్న రోజుల్లో కేటీఆర్ జిల్లాల పర్యటనలు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పనిచేయని ఇంచార్జ్‌ల స్థానంలో కొత్త వారిని నియమించే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు అభిప్రాయ పడుతున్నాయి. కారు పార్టీ కసరత్తు ఏ విధంగా ఉండనుందో.. ఈ స్టోరీలో చూద్దాం.
గత ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత గులాబీ పార్టీని మెజారిటీ నేతలు, కార్యకర్తలు వదిలి వెళ్లిపోవడంతో కారు పార్టీ ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నాలుగు, ఐదు నియోజకవర్గాలు మినహా పార్టీ కోసం శ్రమించి పనిచేస్తున్న నియోజకవర్గ ఇంచార్జ్‌లు లేరన్న అభిప్రాయాలు పార్టీ శ్రేణుల్లో ఉన్నాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు వచ్చే శాసనసభ ఎన్నికల దాకా.. ఇప్పటి నుంచే పార్టీని సంస్థగతంగా బలోపేతం చేసే దిశగా గులాబీ పార్టీ చర్యలకు దిగినట్లు తెలిసింది.
ఇందులో భాగంగానే ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో 10 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా ఇందులో పార్టీ బలహీనంగా ఉన్న చోట్ల నియోజకవర్గ ఇన్చార్జిలను మారుస్తారన్న ప్రచారం జోరందుకుంది. కేటీఆర్ త్వరలో చేపట్టబోయే జిల్లాల పర్యటనలో ఈ ఇంచార్జ్‌ల మార్పుకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Annamalai: విజయ్ వర్క్ ఫ్రమ్ హోం పాలిటిక్స్ చేస్తున్నాడు..
శాసనసభ ఎన్నికల కంటే ముందు వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ కంచుకోటగా నిలిచింది. మంత్రులుగా ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న, ప్రభుత్వ విప్‌గా బాల్క సుమన్‌తో మొత్తం 10 మంది శాసనసభ సభ్యులతో తిరుగులేని రాజకీయ శక్తిగా ఉండేది. ఇప్పుడు అదంతా గతమన్నట్లుగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫాబాద్, బోథ్ స్థానాల్లో మినహా మిగిలిన 8 స్థానాల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం పాలైంది. అక్కడితో ఆగకుండా పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు మాజీ ఎమ్మెల్యేలు ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప, విఠల్ రెడ్డి సహా చాలా మంది కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరటంతో బీర్ఎస్ రాజకీయ ప్రభావం మరింత మసకబారినట్లయ్యింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉండగా… ఎమ్మెల్యేలున్న 2 నియోజవకర్గాలు మినహా.. ఐదు, ఆరు చోట్ల మాత్రమే గులాబీ పార్టీ కొంత ఉనికి చాటుకుంటోంది.
మాజీ మంత్రి జోగు రామన్న, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావులు తరచూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఖనాపూర్ నియోజకవర్గంలో ఇంచార్జ్ జాన్సన్ నాయక్, చెన్నూరులో బాల్క సుమన్, బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్య, సిర్పూర్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లు అడపాదడపా అయినా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎటొచ్చీ నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల్లోనే పార్టీ బాగా వెనకబడి ఉంది. దీంతో ఇక్కడ బలమైన నాయకులని ఇంచార్జ్‌లుగా నియమించాలని పార్టీ భావిస్తోంది. ప్రధానంగా నిర్మల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సిర్పూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కోనప్ప ఇద్దరు కూడా కాంగ్రెస్ అధిష్టానంపై కొంత గుర్రుగానే ఉన్నారు.
వారు కోరుకున్న ప్రాధాన్యత దొరకడం లేదని.. గతంలో తాము కొనసాగిన భారత్ రాష్ట్ర సమితి పార్టీలోనే తమకు మంచి గుర్తింపు ఉండేదని తమ అనుయాయుల వద్ద అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఇక ముథోల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి… పార్టీని వీడిపోవడంతో అక్కడా బీఆర్ఎస్కు బలమైన నాయకత్వం కొరవడింది.
ఇప్పటివరకు ఎదురైన అనుభవాల నేపథ్యంలో పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్ఠం చేసుకోవాలన్న ఆలోచనలో బీఆర్ఎస్ అధినాయకత్వం ఉంది. పార్టీ సంస్థాగత నిర్మాణం దిశగా ఇప్పటికే పలువురు నేతలతో అధినేత కేసీఆర్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఆర్థికంగా బలంగా ఉండటంతో పాటు అన్ని జిల్లాల్లోనూ పార్టీకి కార్యాలయాలు ఉన్నాయి. ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకుని పటిష్ఠం చేయాలని నేతలు భావిస్తున్నారు.
