Crime News

Crime News: జోగిని సుధాకర్ స్వామి కిరాతక హత్య.. భారీగా బంగారం, నగదుతో పరార్!

Crime News: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో ఒళ్లు గగుర్పొడిచే దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. జోగిని వృత్తితో పాటు ‘శివసత్తు’గా స్థానికంగా గుర్తింపు పొందిన రాళ్లబండి సుధాకర్ (48) అలియాస్ సుధాకర్ స్వామిని గుర్తుతెలియని దుండగులు అర్ధరాత్రి అతి కిరాతకంగా హతమార్చారు. అనంతరం ఇంట్లోని భారీ మొత్తంలో బంగారం, నగదు దోచుకుని, స్వామీజీకి చెందిన స్కార్పియో కారులోనే పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది.

పక్కా ప్లాన్‌తో దాడి: పెప్పర్ స్ప్రే కొట్టి.. కాళ్లు చేతులు కట్టేసి!

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని మార్కండేయ కాలనీలో సుధాకర్ స్వామి నివాసం ఉంటున్నారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడిన దుండగులు తొలుత సుధాకర్ కళ్లల్లో పెప్పర్ స్ప్రే కొట్టారు. ఆయన ప్రతిఘటించకుండా కాళ్లు, చేతులు బలంగా కట్టేసి ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేశారు.హత్య అనంతరం ఇంట్లోని బీరువాలను పగులగొట్టి దాదాపు 60 నుంచి 70 తులాల బంగారు ఆభరణాలు, రూ.10 లక్షల నగదును దోచుకున్నారు. దోచుకున్న సొత్తుతో పాటు సుధాకర్‌కు చెందిన వైట్ కలర్ స్కార్పియో వాహనంలో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.
రంగంలోకి క్లూస్ టీమ్.. బోధన్ వద్ద నిందితుల అరెస్ట్?
తెల్లవారుజామున సమాచారం అందుకున్న చౌటుప్పల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించి ఘటనా స్థలంలో వేలిముద్రలు, ఇతర కీలక సాక్ష్యాలను సేకరించారు. నిందితులు అసోం (Assam) రాష్ట్రానికి చెందిన వారిగా ప్రాథమికంగా గుర్తించారు.
గత కొంతకాలంగా వారు సుధాకర్ స్వామి వద్దే శిష్యులుగా నటిస్తూ ఇంట్లోనే ఆశ్రయం పొందుతున్నట్లు బంధువులు వెల్లడించారు. ఇంట్లోని విలువైన వస్తువులను కాజేయడానికే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. దుండగులు ఎత్తుకెళ్లిన స్కార్పియో కారుకు అమర్చిన జీపీఎస్ (GPS) లొకేషన్‌ను పోలీసులు వేగంగా ట్రాక్ చేశారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ పరిసర ప్రాంతాల్లో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందింది. భారీ దోపిడీ కోసమే ఈ హత్య జరిగిందా లేక వ్యక్తిగత లేదా ఆర్థికపరమైన వివాదాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *