Nara Lokesh: అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్న గోపిక అనే విద్యార్థినిపై జరిగిన కిరాతక దాడి ఘటనపై ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తాజా హెల్త్ అప్‌డేట్ ఇచ్చారు. బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆయన వెల్లడించారు. బాలిక పూర్తిస్థాయిలో కోలుకునేంత వరకు అయ్యే వైద్య ఖర్చులతో పాటు కుటుంబానికి అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
శనివారం ఉదయం సుమారు 10:30 గంటల సమయంలో వరుసకు బాబాయ్ అయిన 21 ఏళ్ల హేమంత్ క్లాస్‌రూమ్‌లోకి చొరబడి పవర్ చైన్‌సాతో విచక్షణారహితంగా దాడి చేయడంతో గోపిక ముఖం, మెడ, శరీర భాగాలపై తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే. పరిస్థితి విషమంగా మారడంతో ఏపీ ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని శనివారం అర్థరాత్రి ‘గ్రీన్ ఛానల్’ ద్వారా ప్రత్యేక అంబులెన్స్‌లో ఆమెను బెంగళూరు మణిపాల్ ఆసుపత్రికి తరలించింది. అర్ధరాత్రి ఆసుపత్రికి చేరిన వెంటనే వైద్యుల బృందం బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ (రక్తం ఎక్కించడం), ఎమర్జెన్సీ సపోర్టివ్ ట్రీట్‌మెంట్‌తో బాలిక పరిస్థితిని అదుపులోకి తెచ్చింది.
రక్తస్రావాన్ని అరికట్టిన అనంతరం వైద్యులు ఆమె ముఖం, ఇతర గాయాలకు రెండు ప్రధాన శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేసినట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో చికిత్స ప్రక్రియను ఆయన ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తూ, ఆసుపత్రి వైద్యులతో నిరంతరం మాట్లాడుతున్నారు. మరోవైపు ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి, ధర్మవరం రైల్వే స్టేషన్ సమీపంలో పారిపోవడానికి ప్రయత్నిస్తున్న నిందితుడు హేమంత్‌ను అదుపులోకి తీసుకున్నారు.

