Rapthadu Attack: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో ఒళ్లు గగుర్పొడిచే దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ ఉన్మాది తరగతి గదిలోకి చొరబడి పవర్ చైన్‌సా (విద్యుత్ రంపం)తో అత్యంత కిరాతకంగా దాడి చేశాడు. పాఠశాల వేళల్లో అందరూ చూస్తుండగానే జరిగిన ఈ ఘాతుకం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిలో తీవ్ర రక్తస్రావమైన బాలిక ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.
పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. దాడికి పాల్పడిన నిందితుడు హేమంత్, బాధితురాలికి స్వయానా వరుసకు బాబాయ్ అవుతాడు. గంజాయి, మద్యం తదితర వ్యసనాలకు బానిసైన హేమంత్.. సదరు మైనర్ బాలికను తానే పెళ్లి చేసుకుంటానంటూ కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. కుటుంబ సభ్యులు అతడి ప్రవర్తనను తీవ్రంగా మందలించడంతో కక్ష పెంచుకున్నాడు.
గతంలో కూడా ఇతను లేడీస్ హాస్టళ్ల పరిసరాల్లో యువతులపై దాడులకు పాల్పడిన నేర చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు. పథకం ప్రకారమే పవర్ రంపంతో పాఠశాల గదిలోకి చొరబడిన నిందితుడు, బాలికపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో ఆమె ముఖం, తల, వీపు భాగాల్లో తీవ్రమైన లోతైన గాయాలయ్యాయి. ఈ ఘోరాన్ని అడ్డుకునేందుకు ధైర్యంగా ముందుకు వచ్చిన మరో తోటి విద్యార్థిని కూడా గాయపడింది.
తోటి విద్యార్థులు, ఉపాధ్యాయుల కేకలతో నిందితుడు పరారవగా, తీవ్రంగా గాయపడిన బాలికను వెంటనే అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మంత్రి సత్యకుమార్ వెంటనే ఆసుపత్రికి చేరుకుని బాధితురాలిని పరామర్శించారు. ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. వైద్యులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించిన అనంతరం, మంత్రి సత్యకుమార్ పర్యవేక్షణలోనే ప్రత్యేక అంబులెన్స్‌లో బాలికను మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు.
