Dastagiri: మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు కడప జిల్లా పులివెందులకు చేరుకున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తీవ్ర నిరసన, ఊహించని ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. బాకరాపురం హెలిప్యాడ్ నుంచి కాన్వాయ్‌లో భారీ ర్యాలీగా తన నివాసానికి బయలుదేరిన సమయంలో.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి రోడ్డుపైకి వచ్చి కాన్వాయ్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. ఈ పరిణామంతో పులివెందులలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దస్తగిరి కాన్వాయ్ వద్దకు దూసుకువస్తున్న విషయాన్ని గమనించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు వెంటనే వైఎస్ జగన్‌కు సమాచారం అందించారు. జగన్ వాహనం సమీపంలోకి రాగానే “మా జీవితాలను పూర్తిగా నాశనం చేశావు” అంటూ దస్తగిరి బహిరంగంగానే నినాదాలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. జగన్ ప్రయాణిస్తున్న కారు వైపు వేగంగా వెళ్లేందుకు ప్రయత్నించిన దస్తగిరిని అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది, పోలీసులు సకాలంలో అడ్డుకున్నారు. ఆ సమయంలో వైఎస్ జగన్ అతడిని చూసీచూడనట్లుగా అక్కడి నుంచి ముందుకు వెళ్లిపోయారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన దస్తగిరి తీవ్రమైన ఆరోపణలు చేశాడు. “మా ఇంటి ముందు నుంచే జగన్ కాన్వాయ్ వెళ్తుంటే.. అసలు వైసీపీకి ఎందుకు ఓటు వేయాలో నిలదీసేందుకు మాత్రమే నేను రోడ్డుపైకి వెళ్లాను. కానీ జగన్ ఆదేశాలతో ఆయన అనుచరులు, పార్టీ మనుషులు నాపై విచక్షణారహితంగా దాడి చేశారు. జగన్ దగ్గరుండి నన్ను కొట్టించారు. వైఎస్ జగన్ వల్ల నా ప్రాణాలకు తీవ్ర ముప్పు ఉంది” అని దస్తగిరి ఆరోపించాడు.
మున్సిపల్ ఎన్నికల వేళ పోలింగ్ సరళిని పార్టీ నేతలతో సమీక్షించి, మధ్యాహ్నం 1:00 గంటకు ఓటు వేసి తిరుగు ప్రయాణం కావాల్సిన వైఎస్ జగన్ పర్యటన ప్రారంభంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో పులివెందుల పట్టణంలో పోలీసులు అదనపు బలగాలను మోహరించి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
