Car Accident: పంజాబ్‌లోని జలంధర్‌లో అర్ధరాత్రి వేళ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్నేహితుడి పుట్టినరోజు వేడుకలు ముగించుకుని కారులో ఇంటికి తిరిగి వస్తున్న ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఒకరు ప్రముఖ ర్యాపర్, సింగర్ యో యో హనీ సింగ్ మేనల్లుడు విదిత్ ఓలక్ కాగా.. మరొకరు నగరంలోని ప్రముఖ ‘పప్పీ స్వీట్స్’ యజమాని కుమారుడు ఆరవ్ తల్వార్‌గా పోలీసులు గుర్తించారు. విదిత్ ఓలక్ తండ్రి దినేష్ పంజాబీ మ్యూజిక్ ఇండస్ట్రీలో టాప్ సంస్థ అయిన ‘స్పీడ్ రికార్డ్స్’ అధినేత కావడం గమనార్హం. తన మేనల్లుడి ఆకస్మిక మరణంపై హనీ సింగ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున సుమారు 3:00 గంటల సమయంలో జలంధర్ పోలీస్ లైన్స్ సమీపంలోని ఫ్లైఓవర్‌పై ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో మున్సిపల్ కార్పొరేషన్ పారిశుధ్య కార్మికులు ఫ్లైఓవర్‌పై చెత్తను తొలగిస్తూ, వ్యర్థాలను లోడ్ చేయడానికి ఒక ట్రాక్టర్-ట్రాలీని రోడ్డు పక్కన ఆపి ఉంచారు. బీఎంసీ చౌక్ నుంచి బీఎస్ఎఫ్ చౌక్ వైపు అతివేగంగా వెళ్తున్న వీరి వోక్స్వ్యాగన్ కారు అదుపుతప్పి ఆగివున్న ట్రాక్టర్-ట్రాలీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం నుజ్జునుజ్జయిపోయింది. కారు నడుపుతున్న విదిత్, పక్కనే కూర్చున్న ఆరవ్ ఇద్దరూ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ కారులో అంతకుముందు మొత్తం ఐదుగురు స్నేహితులు ప్రయాణించారని, అయితే ప్రమాదానికి ముందే మిగతా ముగ్గురు తమ ఇళ్ల వద్ద దిగిపోయారని బారాదరి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ సాహిల్ చౌదరి తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు ఎలాంటి న్యాయపరమైన చర్యలు అవసరం లేదని లిఖితపూర్వకంగా తెలపడంతో, లాంఛనాలు పూర్తి చేసిన అనంతరం మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు.
