YS Sharmila: ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహ వేదిక మార్పుపై కీలక ప్రకటన చేశారు. బెంగళూరులోని యలహంక నివాసంలో వివాహం జరిపించాలని ముందుగా భావించినప్పటికీ, అక్కడ తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో పెళ్లి వేదికను మరో ప్రదేశానికి మారుస్తున్నట్లు ఆమె అధికారికంగా వెల్లడించారు. వివాద రహితంగా, ఎలాంటి గొడవలు లేకుండా కుమార్తె వివాహాన్ని జరిపించడమే తల్లిగా తన బాధ్యత అని స్పష్టం చేస్తూ, ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా సుదీర్ఘ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.
ఆస్తుల పంపకాల్లో యలహంక ప్రాపర్టీ నాకే వచ్చింది.. షర్మిల స్పష్టత
తెలుగు ప్రజల ఆశీస్సులు కోరిన షర్మిల
నాది కానీ దానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు.
జగన్ మోహన్ రెడ్డి గారు @ysjagan ముఖ్యమంత్రి అయ్యాక, అప్పటి వరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న యలహంక ప్రాపర్టీ.. ఆస్తుల పంపకాల్లో భాగంగా, పూర్తిగా 100 శాతం నా, నా పిల్లల భాగానికి వచ్చింది. ఇది దేవుడి సాక్షిగా నిజం.నా బిడ్డల హక్కు కాబట్టి, నాన్న YSR తిరిగిన ఇల్లు కనుక, నా కుమార్తె అంజిలి కోరినట్లుగా తన వివాహం అక్కడ చేయాలనుకున్నాం. మన తెలుగింట ఏ గుమ్మాన్ని అడిగినా చెప్తుంది.. సొంత ఇంట్లో బిడ్డ పెళ్లి చేయడం ప్రతి తల్లిదండ్రులకు అదృష్టమని.
కానీ, తాను పెరిగిన ఇల్లే పెళ్లి వేదిక కావాలన్న నా బిడ్డ ఆకాంక్షను నెరవేర్చలేక పోయామని చాలా బాధపడుతున్నాం.వివాహ వేదిక విషయంలో జరుగుతున్న పరిణామాలను చూసి, నా బిడ్డ గురించి బాధపడిన ప్రతి ఒక్కరికీ నా వందనం. నా కుమార్తె అంజిలి పెళ్లి.. పెద్దలు కుదిర్చిన సంబంధం. వివాద రహితంగా, ఎలాంటి గొడవలు లేకుండా, వివాహం జరిపించాల్సిన బాధ్యత మా మీద ఉంది.
అందుకే వైఎస్ అంజిలి రెడ్డి – సోమల రఘురామ్ రెడ్డిల పరిణయ వేడుకను యలహంక ఇంట్లో కాకుండా, వేరే ప్రదేశంలో బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో నిర్వహించాలని నిశ్చయించుకున్నాం.
కాబోయే నవదంపతులకు తెలుగు ప్రజల ఆశీస్సులు, దీవెనలు ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం.
— YS Sharmila (@realyssharmila) October 31, 2026
