Fake Currency

Fake Currency: విశాఖలో భారీ నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు.. ఎన్నికల వేళ నలుగురు అరెస్ట్!

Fake Currency: మున్సిపల్ ఎన్నికల వేళ విశాఖపట్నంలో భారీ నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టయింది. జగదాంబ కూడలి సమీపంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో బస చేసి నకిలీ నోట్లను చలామణి చేసేందుకు సిద్ధమైన నలుగురు సభ్యుల ముఠాను మహారాణిపేట పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ఏకంగా రూ.66 లక్షల విలువ చేసే రూ.500 నకిలీ కరెన్సీ నోట్లు (కలర్ జిరాక్స్ కాపీలు), బెదిరింపులకు ఉపయోగించేందుకు తెచ్చుకున్న ఓ డమ్మీ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాణిపేట పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ లక్ష్మణమూర్తి ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

హోటల్ రూమ్‌లో ఆకస్మిక తనిఖీలు.. తప్పించుకునే యత్నం!

ఎన్నికల నేపథ్యంలో నగరవ్యాప్తంగా శాంతిభద్రతలను పర్యవేక్షిస్తూ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. శుక్రవారం మధ్యాహ్నం మహారాణిపేట పోలీసులు జగదాంబ జంక్షన్ సమీపంలోని వీస్టార్ హోటల్‌లో ఆకస్మిక సోదాలు నిర్వహించారు.హోటల్‌లోని గది నంబర్ 105ను తనిఖీ చేయడానికి వెళ్లగా, అక్కడ బస చేసిన నలుగురు వ్యక్తులు పోలీసులను చూసి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేశారు.

అప్రమత్తమైన పోలీసులు వారిని చాకచక్యంగా వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేయగా, పెద్ద మొత్తంలో రూ.500 కలర్ జిరాక్స్ నకిలీ కరెన్సీ కట్టలతో పాటు ఒక డమ్మీ గన్ బయటపడింది.

నిందితుల వివరాలు.. సోషల్ మీడియా ద్వారా పరిచయం

అరెస్టయిన నలుగురు వ్యక్తులు వివిధ ప్రాంతాలకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు.

  1. పాంగి కొండబాబు (అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకులోయ మండలం, దోమలజోరు గ్రామం)

  2. బేవర సాయి (పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు పెద్దవీధి)

  3. ఇజ్జవరపు దుర్గాప్రసాద్ (పార్వతీపురం మన్యం జిల్లా, మక్కువ మండలం, మామిడిపల్లి)

  4. వెలగడ దినేష్

పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ ముఠా సభ్యులకు సోషల్ మీడియా ద్వారా పరస్పరం పరిచయమైనట్లు తేలింది. వీరంతా మూడు రోజుల క్రితమే విశాఖకు చేరుకుని సదరు హోటల్ గదిలో బస చేశారు.

తెరవెనుక ‘చందు’.. ప్లాన్ బెడిసికొడితే తుపాకీతో బెదిరింపులు!

పోలీసుల విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరిస్తూ పలు విషయాలను వెల్లడించారు. పరారీలో ఉన్న ‘చందు’ అనే ప్రధాన నిందితుడు ఈ రూ.500 నకిలీ కరెన్సీ నోట్లను తయారు చేసి వీరి చేతికి అప్పగించాడు. మున్సిపల్ ఎన్నికల హడావుడిని ఆసరాగా చేసుకుని, మార్కెట్లో వీటిని అసలైన కరెన్సీగా చలామణి చేసి భారీగా సొమ్ము చేసుకోవాలని ప్లాన్ చేశారు. లావాదేవీల సమయంలో ఎవరైనా నోట్లను గుర్తించి అడ్డుచెబితే, తమ వద్ద ఉన్న డమ్మీ తుపాకీతో భయపెట్టి అక్కడి నుంచి పరారవ్వాలని ముందస్తు పథకం రచించారు.

వైజాగ్‌లో ఇంకా నోట్లు చలామణి కాలేదు: ఏసీపీ లక్ష్మణమూర్తి

నగరంలోకి ప్రవేశించిన వెంటనే పోలీసులు వీరిని పట్టుకోవడంతో, విశాఖపట్నంలో ఇప్పటివరకు ఈ నకిలీ కరెన్సీ నోట్లు ఎక్కడా చలామణి కాలేదని ఏసీపీ స్పష్టం చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు చందుతో పాటు ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు వీటిని తీసుకొచ్చారా లేక సాధారణ మార్కెట్‌లో చలామణి చేయడమే లక్ష్యమా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *