Egg Donation Racket

Egg Donation Racket: హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా.. !

Egg Donation Racket: హైదరాబాద్ మహానగరంలో మహిళా హాస్టల్ బోర్డు తగిలించి తెరవెనుక అక్రమంగా అండాలు, వీర్యకణాల సేకరణ వ్యాపారం సాగిస్తున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన పేద యువతులను టార్గెట్ చేస్తూ సాగుతున్న ఈ అక్రమ నెట్‌వర్క్‌పై బేగంపేట పోలీసులు, స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) సంయుక్తంగా అర్ధరాత్రి ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ సోదాల్లో పది మంది ఇతర రాష్ట్రాల యువతులను అదుపులోకి తీసుకోవడం నగరంలో తీవ్ర కలకలం రేపింది.

అర్ధరాత్రి 2 గంటలకు మెరుపు దాడి.. ప్రకాశ్‌నగర్‌లో ఏం జరిగింది?

బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రకాశ్‌నగర్ ప్రాంతంలో ఉన్న నజ్రాన్ అపార్ట్‌మెంట్‌లో అనుమతులు లేకుండా అనుమానాస్పద కార్యకలాపాలు సాగుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది.

శుక్రవారం అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో ఎస్‌వోటీ, బేగంపేట పోలీసులు సదరు అపార్ట్‌మెంట్‌పై ఆకస్మిక సోదాలు నిర్వహించారు. అక్కడ ‘అమీ నీతా గర్ల్స్ హాస్టల్’ పేరుతో కొనసాగుతున్న ప్రాంగణంలో పది మంది యువతులు ఉండగా, వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అదుపులోకి తీసుకున్న యువతులంతా బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా వంటి ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అర్ధరాత్రి వేళ భారీగా పోలీసులు మొహరించి తనిఖీలు చేపట్టడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

ఏడాది కాలంగా దందా.. డోనర్ల సేకరణ వెనుక మహిళ పాత్ర?

పోలీసుల ప్రాథమిక విచారణలో పలు దిగ్భ్రాంతికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రాంగణంలో దాదాపు ఏడాది కాలంగా ఈ తరహా కార్యకలాపాలు సాగుతున్నట్లు గుర్తించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులకు ఉద్యోగాలు, ఉపాధి లేదా భారీగా డబ్బు ఇప్పిస్తామనే ఆశ చూపి హైదరాబాద్‌కు రప్పించారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక మహిళ నడిపిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె పాత్ర, యువతులను నగరానికి తీసుకురావడంలో ఉన్న మధ్యవర్తుల వివరాలపై విచారణ ముమ్మరం చేశారు.

ఫెర్టిలిటీ సెంటర్లతో లింకులు.. మెడికల్ నిబంధనలు గాల్లోకి!

సంతానలేమి సమస్యలతో బాధపడే దంపతులకు చికిత్స అందించే క్రమంలో డోనర్ అండాలు, వీర్యకణాలను ఉపయోగించడం వైద్యపరంగా చట్టబద్ధమే అయినప్పటికీ.. అందుకు నిర్దిష్ట నిబంధనలు (ART Regulations), డోనర్ స్వచ్ఛంద సమ్మతి, తగిన వైద్య పర్యవేక్షణ తప్పనిసరి.

ఇక్కడ ఉన్న యువతుల నుంచి సేకరిస్తున్న అండాలకు వారి పూర్తి సమ్మతి ఉందా? లేక ఆర్థిక బలహీనతలను ఆసరాగా చేసుకుని ఒత్తిడి తెస్తున్నారా? అండాలను ఎక్కడ సేకరిస్తున్నారు? ఏఏ ప్రముఖ ఫెర్టిలిటీ కేంద్రాలు లేదా క్లినిక్‌లకు వీటిని గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు?

మహిళల అండాలతో పాటు పురుషుల వీర్యకణాల సేకరణ, సరఫరాతో కూడా ఈ ముఠాకు సంబంధాలున్నాయా? అనే అంశాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నగరంలో పేరుమోసిన ఫెర్టిలిటీ ఆసుపత్రులు, మధ్యవర్తుల పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అదుపులోకి తీసుకున్న యువతులను ప్రత్యేక బృందం విచారిస్తోందని, నిబంధనలను ఉల్లంఘించి వైద్య ప్రొటోకాల్స్ పాటించకుండా ఈ దందా నడుపుతున్న నిర్వాహకులు, సంబంధిత క్లినిక్‌లపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ వర్గాలు వెల్లడించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *