Raptadu Incident: అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై తరగతి గదిలోనే రంపంతో జరిగిన దాడి ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి, ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ క్లాస్‌రూమ్‌లోనే ఒక చిన్నారిపై ఇంతటి అమానుష దాడి జరగడం అత్యంత దుర్మార్గమని, ఆడపిల్లల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు.
నెత్తుటి మడుగులో చిన్నారిని చూసి కన్నీళ్లు ఆగడం లేదు.. మంత్రి నారా లోకేష్ భావోద్వేగం
రాప్తాడు ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. చిన్నారి చెల్లిని క్లాస్‌రూమ్‌లో నెత్తుటి మడుగులో చూశాక కన్నీళ్లు ఆగడం లేదు, గుండె బరువెక్కింది. రాప్తాడులో ఉన్మాది చేసిన ఘాతుకం నన్ను తీవ్రంగా కలచివేసింది” అని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఆడపిల్లల జోలికి రావాలంటేనే భయపడేలా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమాజంలో ఇలాంటి ఉన్మాదులను ఉక్కుపాదంతో అణిచివేస్తామని తేల్చిచెప్పారు. పాఠశాలల్లో పిల్లల భద్రత విషయంలో ఎలాంటి అలసత్వాన్ని ఉపేక్షించబోమని, ఇందులో నిర్లక్ష్యం వహించిన వారు ఎంతటి వారైనా చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఇలాంటి వారికి సమాజంలో చోటు లేదు.. సీఎం చంద్రబాబు సీరియస్
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ తరగతి గదిలోనే విద్యార్థినిపై ఇంత కిరాతకంగా దాడి చేసిన ఉన్మాదులకు సమాజంలో ఉండే హక్కు లేదని మండిపడ్డారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు వెంటనే గాలించి పట్టుకోవాలని, అత్యంత కఠినమైన చట్టపరమైన శిక్ష త్వరితగతిన అమలయ్యేలా చూడాలని ఆదేశించారు.
తీవ్ర గాయాలపాలైన విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై అధికారులతో మాట్లాడిన సీఎం, ఆమె కోలుకునే ప్రక్రియను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. బాధితురాలికి అత్యున్నత ప్రాధాన్యతతో మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని వైద్య బృందాన్ని ఆదేశించారు. పాఠశాలలో విద్యార్థినుల భద్రతపై విద్యాశాఖ అధికారులను నివేదిక కోరిన ప్రభుత్వం, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యా సంస్థల్లో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని నిర్ణయించింది.
