CM Vijay

CM Vijay: తేని జైలు బ్రేక్ ఘటనపై సీఎం విజయ్ సీరియస్.. రాష్ట్రవ్యాప్తంగా జైళ్లలో హై అలర్ట్!

CM Vijay: తమిళనాడులోని తేని జిల్లా తెక్కంపట్టి సబ్ జైలు నుంచి 17 మంది ఖైదీలు సినీఫక్కీలో తప్పించుకుపోయిన ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించి, భద్రతా లోపాలకు కారణమైన అధికారులపై ముఖ్యమంత్రి విజయ్ కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా తేని జైలు సూపరింటెండెంట్‌పై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు జైళ్ల శాఖలో పలువురు ఉన్నతాధికారుల బదిలీలు చేపట్టారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జైళ్లలో నిఘా, భద్రతను పటిష్ఠం చేయాలని సీఎం ఉన్నతాధికారులను ఆదేశించారు.

ఏం జరిగింది? అత్యవసర పరిస్థితి పేరిట జైలు సిబ్బందిపై దాడి!

అక్టోబర్ 26న రాత్రి తేని జిల్లా టెక్కంపట్టి సబ్-జైలులో ఈ సంచలన జైలు బ్రేక్ ఘటన చోటుచేసుకుంది.. జైలులోని విచారణ ఖైదీలు ఓ వైద్యపరమైన అత్యవసర పరిస్థితి తలెత్తినట్లు నటించి గందరగోళం సృష్టించారు. జైలు తలుపులు తీసిన వెంటనే అక్కడున్న గార్డులు, సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేసి వారి వద్ద ఉన్న తాళాలు లాక్కున్నారు. మొత్తం 17 మంది ఖైదీలు ఒక్కసారిగా జైలు గోడలు దూకి పరారయ్యారు.
రంగంలోకి 20 ప్రత్యేక బృందాలు.. అందరూ అరెస్ట్!
ఖైదీలు తప్పించుకున్న వెంటనే రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. తప్పించుకున్న ఖైదీలను పట్టుకునేందుకు పోలీసులు దాదాపు 20కి పైగా ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సరిహద్దులు, అటవీ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలించి పరారైన 17 మందిని పోలీసులు చాకచక్యంగా తిరిగి అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారందరినీ రాష్ట్రంలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే వివిధ కేంద్ర కారాగారాలకు (Central Prisons) తరలించే ప్రక్రియను అధికారులు చేపట్టారు.
అధికారులపై వేటు.. సీఎం విజయ్ కఠిన ఆదేశాలు
ఈ ఘటనలో భద్రతా వైఫల్యంపై ప్రభుత్వం వేగంగా స్పందించింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను తేని జైలు సూపరింటెండెంట్ నాగేశ్వరన్‌ను అక్టోబర్ 30 నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు సస్పెండ్ చేశారు.
ఇప్పటికే ఈ ఉదంతంలో బాధ్యులైన మరో తొమ్మిది మంది జైలు సిబ్బందిపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. పరిపాలనాపరమైన మార్పుల్లో భాగంగా మధురై సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌గా ఉన్న ఆర్. కృష్ణరాజ్‌ను సేలం సెంట్రల్ జైలుకు బదిలీ చేశారు. శాంతిభద్రతలు, జైళ్ల భద్రత విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని, బాధ్యులపై విచారణ జరిపి కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు.
రాష్ట్రంలోని అన్ని జైళ్లలో సీసీటీవీ నెట్‌వర్క్, అదనపు గార్డుల నియామకం, అత్యవసర అలారం వ్యవస్థలను బలోపేతం చేయాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. భద్రతా ఆడిట్ నిర్వహించి లోపాలను తక్షణమే సరిదిద్దాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *