కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీల సమక్షంలో లోకేశ్ చేసిన ప్రసంగం సభికుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.
మదనపల్లె త్యాగాల గడ్డ – గాంధీజీతో చారిత్రక అనుబంధం..
గాంధీ జయంతి రోజున మదనపల్లె నేలపై మాట్లాడటం ఎంతో గర్వకారణమని లోకేశ్ గుర్తుచేసుకున్నారు. త్యాగం, పోరాటానికి మారుపేరు ఈ మదనపల్లె గడ్డ. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో మహాత్మా గాంధీ స్వయంగా మదనపల్లెకు వచ్చారు. నాడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే స్వాతంత్ర్య పోరాటానికి అత్యధిక విరాళాలు అందించిన చరిత్ర మదనపల్లె ప్రజలది. బ్రిటిష్ వారి అరాచకాలకు ఎదురొడ్డి లాఠీ దెబ్బలు తిన్న ఘనత ఇక్కడి బీటీ కాలేజీ (BT College) విద్యార్థులది అని కొనియాడారు. గాంధీజీ దేశానికి స్వాతంత్ర్యం, స్వేచ్ఛను ఇవ్వడమే కాకుండా.. రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని నమ్మి వారి హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేశారని గుర్తుచేశారు.
యువగళంపై కోడిగుడ్లు, బాటిళ్లు విసిరినా.. సీమ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు..
తన ‘యువగళం’ పాదయాత్ర రోజులను లోకేశ్ గుర్తుచేసుకుంటూ ఆనాటి ఇబ్బందులను ప్రస్తావించారు.. నేను రాయలసీమ గడ్డపై యువగళం పాదయాత్ర ప్రారంభించినప్పుడు నన్ను అడ్డుకునేందుకు అప్పటి వైసీపీ నేతలు నాపై రాళ్లు, వాటర్ బాటిళ్లు, కోడిగుడ్లు విసిరి నానా రకాలుగా హింసించి ఇబ్బందులు పెట్టారు. కానీ రాయలసీమ ప్రజలు నన్ను వారి బిడ్డలా ఆశీర్వదించి, అక్కున చేర్చుకున్నారు. వారి ఆశీస్సులతోనే నేను వేల కిలోమీటర్ల పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేయగలిగాను అని చెప్పారు.
పాదయాత్రలో భాగంగా ప్రతి గ్రామంలో పర్యటించి రైతుల కన్నీళ్లను, సీమ కరవు కష్టాలను కళ్లారా చూశానని.. రైతు కుటుంబంలో పుట్టిన నాయకుడు చంద్రబాబుకు రైతుల సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉందని తెలిపారు.
‘మిషన్ రాయలసీమ’ డిక్లరేషన్ – ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం..
2023 జూన్‌లో కడప గడ్డపై తాను ‘మిషన్ రాయలసీమ’ డిక్లరేషన్ ప్రకటించిన విషయాన్ని లోకేశ్ గుర్తుచేశారు. రాయలసీమను ప్రపంచస్థాయి హార్టికల్చర్ హబ్‌గా మార్చే బాధ్యత తమ కూటమి ప్రభుత్వానిదేనని నాడు చెప్పామని, నేడు ఆ మాటను అక్షరాలా నిజం చేస్తూ రూ. లక్ష కోట్ల ప్రాజెక్టును మదనపల్లెకు తీసుకొచ్చామని స్పష్టం చేశారు.
రాయలసీమ పంటలు విదేశాలకు ఎగుమతి..
సీమ రైతులు పండించే నాణ్యమైన పండ్లు, ఉద్యాన పంటలను కేవలం స్థానిక మార్కెట్లకు మాత్రమే కాకుండా.. గ్లోబల్ మార్కెట్‌తో అనుసంధానం చేసి నేరుగా విదేశాలకు ఎగుమతి అయ్యేలా అత్యున్నత కోల్డ్ స్టోరేజ్, లాజిస్టిక్స్ వ్యవస్థను తీసుకొస్తున్నామన్నారు.
ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్..
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్ మెలకువలను రైతులకు చేరువ చేసి వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు మదనపల్లె హబ్ ఉపయోగపడుతుందన్నారు.
బాబును వాటర్ మ్యాన్ అంటే గొడ్డలి పార్టీకి కడుపుమంట!
టీడీపీ పాలనలోనే రాయలసీమ ప్రాజెక్టులన్నీ మొదలై పూర్తయ్యాయని లోకేశ్ గర్వంగా చెప్పారు.
1997లోనే డ్రిప్ ఇరిగేషన్:
“కరువు నేలలో నీటి విలువ తెలిసిన నాయకుడు చంద్రబాబు. అందుకే 1997లోనే ఇజ్రాయెల్ దేశం నుంచి అత్యాధునిక డ్రిప్ ఇరిగేషన్ (బిందు సేద్యం) టెక్నాలజీని తీసుకొచ్చి రాయలసీమ రైతులకు పరిచయం చేశారు. వ్యవసాయ రంగంలో అదొక సంచలన విప్లవం.”
విమర్శలకు కౌంటర్:
చంద్రబాబు చేసిన జల సంరక్షణ పనులను, నదుల అనుసంధానాన్ని మెచ్చి జాతీయ, అంతర్జాతీయ ఆంగ్ల పత్రికలు ఆయన్ను గౌరవంగా ‘వాటర్ మ్యాన్’ అని పిలుస్తుంటే.. ఓర్వలేక ‘గొడ్డలి పార్టీ’ విమర్శలు చేస్తోందని మండిపడ్డారు.
రాయలసీమలో పరిశ్రమలు, ఐటీ, సాగునీరు, వ్యవసాయం.. ఇలా అన్ని రంగాల్లో సమతుల్య అభివృద్ధి సాధించి ఈ ప్రాంత యువతకు ఇక్కడే ఉద్యోగాలు కల్పిస్తామని, రాయలసీమను దేశంలోనే సరికొత్త ఆర్థిక శక్తిగా నిలబెడతామని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు.