Chandrababu: రాయలసీమ అంటే ఒకప్పుడు కరవు నేల.. కానీ ఇకపై అది కరవు సీమ కాదు, బంగారు పంటలు పండే సిరుల సీమ! అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె వేదికగా శుక్రవారం (గాంధీ జయంతి, అక్టోబర్ 2, 2026) జరిగిన చారిత్రాత్మక సభలో రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ISA) ప్రాజెక్టులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు.
-
తెలుగు నేల దత్తపుత్రుడు:“అనంత్ అంబానీ గారు చాలా వినమ్రంగా మాట్లాడారు. ఆయన కేవలం పారిశ్రామికవేత్త మాత్రమే కాదు.. పర్యావరణాన్ని, మూగజీవాలను ప్రాణంగా ప్రేమించే గొప్ప వ్యక్తి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఏకంగా 3,500 ఎకరాల్లో ‘వంతార’ పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద జంతు పునరావాస కేంద్రాన్ని నిర్మించారు. తిరుమల శ్రీవారిపై ఉన్న అపారమైన భక్తితో తిరుపతి కొండపైకి ఉచితంగా ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా ఇచ్చారు. అలాంటి అనంత్ అంబానీ ఇవాళ్టి నుంచి మన ‘తెలుగు బిడ్డ’.. మనందరి ‘ముద్దు బిడ్డ’!” అంటూ చంద్రబాబు కితాబిచ్చారు.
-
పని పూర్తయ్యేదాకా వదలరు:అనంత్ అంబానీ ఏ ప్రాజెక్టు చేపట్టినా అది పూర్తయ్యి, విజయవంతం అయ్యేంతవరకు విశ్రమించరని, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌తో ఏపీలో విప్లవాత్మక మార్పులు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
₹1 లక్ష కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ – కరవు నేల ‘ఫ్రూట్ బౌల్’గా మార్పు..
-
యాపిల్ నుంచి స్ట్రాబెర్రీ వరకు:“రాయలసీమ రైతులకు కొద్దిగా సాగునీరు అందిస్తే చాలు.. మట్టిలోంచి బంగారం పండిస్తారు. ప్రకృతి సేద్యంలో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. రాయలసీమలో యాపిల్ నుంచి స్ట్రాబెర్రీ వరకు.. ఏకంగా 20 రకాల పండ్ల తోటలను పండించగల సత్తా మన అన్నదాతలకు ఉంది. అందుకే రాష్ట్రాన్ని దేశానికే ‘ఫ్రూట్ బౌల్’గా మార్చబోతున్నాం” అని ప్రకటించారు.
-
మార్కెట్ & ధరల స్థిరీకరణ:హార్టికల్చర్ పంటలను 6 లక్షల హెక్టార్లకు విస్తరిస్తామని చెప్పారు. పండించిన పంటలకు సరైన కోల్డ్ స్టోరేజీలు, ప్రాసెసింగ్ యూనిట్లు, గ్లోబల్ మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే రైతులు అపారమైన సంపదను సృష్టిస్తారన్నారు. ఈ లక్ష కోట్ల రూపాయల గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌తో పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభించి ధరల స్థిరీకరణ జరుగుతుందన్నారు.
-
ఐఐఎం, ఐఐటీ తరహాలో ఐఎస్ఏ (ISA):ఐఐఎంలో మేనేజ్‌మెంట్ లీడర్లు, ఐఐటీలో టెక్నాలజీ నిపుణులు తయారైనట్లుగా.. మదనపల్లెలో ఏర్పాటు చేస్తున్న ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’ ద్వారా వ్యవసాయ రంగంలో ప్రపంచస్థాయి సాంకేతిక నిపుణులు, అగ్రి-లీడర్లు తయారవుతారని వెల్లడించారు.
నాడు హైటెక్ సీఎం.. నేడు వాటర్ మ్యాన్ అంటుంటే గర్వంగా ఉంది!
-
హంద్రీనీవా లేకపోతే వలసలే:స్వర్గీయ ఎన్టీఆర్ మొదలుపెట్టిన ప్రాజెక్టులను తాము వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా కృష్ణా జలాలు రాకపోతే మదనపల్లె, తంబళ్లపల్లె ప్రాంతాల ప్రజలు ఎప్పుడో ఊళ్లు ఖాళీ చేసి వలస వెళ్లిపోయేవారని గుర్తుచేశారు. శ్రీశైలం నుంచి ఏకంగా 800 కిలోమీటర్ల మేర నీటిని తరలించి సీమ చెరువులను నింపామన్నారు.
-
సీఈవో నుంచి వాటర్ మ్యాన్ వరకు:“నన్ను గతంలో అంతా ఐటీ సీఎం, హైటెక్ సీఎం, సీఈవో అని పిలిచేవారు. కానీ ఇప్పుడు నన్ను ‘వాటర్ మ్యాన్’ అని పిలుస్తుంటే నాకెంతో గర్వంగా, సంతోషంగా ఉంది. పట్టిసీమ ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేయడం వల్లే రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగాం. వెలిగొండ ఫేజ్-1 పూర్తి చేశాం. రాబోయే రోజుల్లో పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం” అని స్పష్టం చేశారు.
-
₹35,000 కోట్లతో 36 ప్రాజెక్టులు:వచ్చే మూడేళ్ల కాలంలో రూ.35 వేల కోట్ల వ్యయంతో 36 పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీరందిస్తామని హామీ ఇచ్చారు. హంద్రీనీవా ఫేజ్-2, వెలిగొండ ఫేజ్-2, మడకశిర బ్రాంచ్ కెనాల్ విస్తరణ పనులను వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు..
-
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన ప్రతిసారీ రాయలసీమ కరవు కష్టాలు, ఇక్కడి రైతుల పేదరికం గురించే చర్చించేవాడినని చెప్పారు.
-
ప్రధాని నరేంద్ర మోదీ, నిర్మలా సీతారామన్ ఏపీ అభివృద్ధికి సంపూర్ణంగా సహకరిస్తున్నారని, అడిగిన ప్రతిదానికీ నిధులు మంజూరు చేస్తున్నారని కొనియాడారు. చివరకు సంక్షోభంలో ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కూడా కేంద్రం నిధులు కేటాయించి కాపాడిందని గుర్తుచేశారు.
మహాత్మా గాంధీ చెప్పినట్లు “గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు” అనే సిద్ధాంతాన్ని తాము నిజం చేస్తున్నామని, అక్టోబర్ 2, 2026 అనేది రాయలసీమ వ్యవసాయ విప్లవ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని చంద్రబాబు ముగించారు.
