Honeytrap

Honeytrap: జూబ్లీహిల్స్ పబ్‌లో రొమాంటిక్ డేట్ అనుకుంటే రూ.29 వేలు స్వాహా..

Jubilee Hills Honeytrap: డేటింగ్ యాప్‌లో పరిచయమైన అందమైన అమ్మాయితో సరదాగా గడపాలని వెళ్లిన ఓ యువకుడికి ఊహించని షాక్ తగిలింది. రొమాంటిక్ డేట్ అనుకుని వెళ్తే.. అది తనను నిలువునా ముంచేసేందుకు వేసిన పక్కా ‘హనీ ట్రాప్’ అని తేలడంతో లబోదిబోమన్నాడు. హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లో వెలుగుచూసిన ఈ ఘటన నగరంలో కలకలం రేపింది.

అసలు ఏం జరిగిందంటే..?

హైదరాబాద్‌కు చెందిన హేమంత్ అనే యువకుడికి ‘క్వాక్ క్వాక్’ (Quack Quack) డేటింగ్ యాప్ ద్వారా ‘దివ్య’ అనే యువతి పరిచయమైంది. కొద్దిరోజులు చాటింగ్ చేసుకున్న తర్వాత ఇద్దరూ నేరుగా కలుసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. ఆ యువతి చెప్పినట్లే ఇద్దరూ కలిసి జూబ్లీహిల్స్‌లోని ‘36 కెమిస్ట్రీ పబ్’ (36 Chemistry Pub)కు వెళ్లారు. అక్కడ కాసేపు ఫుడ్, డ్రింక్స్ ఆర్డర్ చేసి సరదాగా సమయం గడిపారు. అసలు ట్విస్ట్ బిల్లు చెల్లించే సమయంలో మొదలైంది.
ఆ యువతి, పబ్ సిబ్బంది ముందే కుమ్మక్కై ఒక నకిలీ పేమెంట్ ట్రాన్సాక్షన్ స్క్రీన్ చూపించారు. డబ్బులు ఖాతాలో పడ్డాయని నమ్మబలికి, చివరకు హేమంత్ చేతే ఏకంగా రూ.29,000 బిల్లు కట్టించారు. కొద్దిసేపటి తర్వాత తన బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చూసుకున్న హేమంత్.. యువతి చేసిన పేమెంట్ రాలేదని, తాను నిలువునా మోసపోయానని గ్రహించాడు. అప్పటికే ఆ యువతి, పబ్ సిబ్బంది తనకు హ్యాండ్ ఇవ్వడంతో నేరుగా పోలీసుల వద్దకు వెళ్లాడు.
రంగంలోకి జూబ్లీహిల్స్ పోలీసులు..
బాధితుడు హేమంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ‘36 కెమిస్ట్రీ పబ్’లోని సీసీటీవీ ఫుటేజ్, క్వాక్ క్వాక్ యాప్‌లో ఆ యువతి ప్రొఫైల్ వివరాలు, కాల్ డేటాను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.ఈ తరహా హనీట్రాప్ వెనుక పబ్ సిబ్బంది, ఇతర ముఠాల ప్రమేయం ఎంతవరకు ఉందనే కోణంలో లోతుగా విచారణ జరుపుతున్నారు.

డేటింగ్ యాప్ యూజర్లకు పోలీసుల హెచ్చరిక..

సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌ల ద్వారా పరిచయమయ్యే గుర్తుతెలియని వ్యక్తులతో అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు యువతకు సూచించారు. ఖరీదైన పబ్‌లు, కేఫ్‌లకు పిలిచి ఇలా పక్కా స్కెచ్‌తో భారీ మొత్తంలో బిల్లులు వేయించి మోసాలకు పాల్పడే ముఠాలు తిరుగుతున్నాయని, కొత్తవారితో బయటకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *