The Paradise Movie Review

The Paradise Movie Review: మితిమీరిన వయోలెన్స్.. పారడైస్ తో నాని హిట్ కొట్టాడా.. బ్లాక్ బస్టర్ కొట్టాడా..?

The Paradise Movie Review:

  • నటీనటులు: నాని, మోహన్ బాబు, సోనాలి కులకర్ణి, కాయదు లోహర్, రాఘవ్ జుయల్, ప్రియదర్శి, సంపూర్ణేష్ బాబు, తనికెళ్ల భరణి తదితరులు
  • సంగీతం: అనిరుధ్ రవిచందర్
  • సినిమాటోగ్రాఫర్(DOP): సీహెచ్ సాయి
  • ఎడిటింగ్: నవీన్ నూలి
  • నిర్మాత: సుధాకర్ చెరుకూరి
  • రచన – దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల
  • రేటింగ్: 2.0/5
‘దసరా’ వంటి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘ది ప్యారడైజ్’ అనౌన్స్‌మెంట్ నుంచే  హైప్ తెచ్చుకున్న ఈ సినిమా  గురువారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. మరి భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ ఊర మాస్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం.

కథా నేపథ్యం

దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా సికింద్రాబాద్ పరిసరాల్లోని ‘ప్యారడైజ్’ ప్రాంతంలో బతికే ‘సవారీ’ తెగకు మాత్రం ఎలాంటి గుర్తింపు దక్కదు. వారిని కనీసం మనుషులుగా కూడా చూడని స్థితిలో ఆ ప్రాంతాన్ని తన కనుసన్నల్లో శాసిస్తుంటాడు శిఖంజ మాలిక్ (మోహన్ బాబు). సవారీలపై మాలిక్‌కు ఉన్న ద్వేషం కారణంగా వ్యవస్థ కూడా వాళ్లకు సహకరించదు. తమ జాతి ఆత్మగౌరవం, హక్కుల కోసం సమ్మక్క (సోనాలి కులకర్ణి) ఒంటరి పోరాటం చేస్తుంటుంది.
ఆమె కొడుకు జడల్ (నాని) ఒక హత్య కేసులో 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి బయటకు వస్తాడు. అయితే ఒక గతానుభవం వల్ల తల్లిని తప్పుగా అర్థం చేసుకుని ఆమెను ద్వేషిస్తూ దూరంగా ఉంటాడు. జైలు నుంచి వచ్చాక శిఖంజ మాలిక్ కొడుకు విక్రమ్ మాలిక్ (రాఘవ్ జుయల్)తో జడల్‌కు వైరం మొదలవుతుంది. ఆ ఘర్షణల క్రమంలో తల్లి చేసిన త్యాగాన్ని గ్రహించిన జడల్.. ఆమె పోరాటాన్ని తన భుజాలపైకి ఎత్తుకుంటాడు. మరి శిఖంజ మాలిక్ అరాచకాలను జడల్ ఎలా ఎదుర్కొన్నాడు? సవారీ తెగకు సమాజంలో గుర్తింపు తెచ్చిపెట్టాడా? అన్నదే మిగతా కథ.

కథనం – విశ్లేషణ

అణగారిన వర్గాల గుర్తింపు, ఆత్మగౌరవ పోరాటాలు మనకు కొత్తేమీ కాదు. ‘ఛత్రపతి’, ‘కేజీఎఫ్’, ‘పుష్ప’ లాంటి సినిమాల్లో ఇదే తరహా నేపథ్యాన్ని చూశాం. అయితే వాటిలో హీరో పాత్రలకు ఉండే బలమైన ఎమోషనల్ కనెక్ట్, దర్శకుడు సృష్టించే హై-వోల్టేజ్ ఎలివేషన్స్ ఆ సినిమాలను బ్లాక్‌బస్టర్లుగా నిలబెట్టాయి. ‘ది ప్యారడైజ్’లోనూ శ్రీకాంత్ ఓదెల అలాంటి లైన్‌నే ఎంచుకుని, తనదైన రా అండ్ రస్టిక్ స్టైల్‌లో తెరకెక్కించే ప్రయత్నం చేశాడు.
సినిమా మొదటి 15 నిమిషాలు, నాని ఎంట్రీ, హీరో బ్యాక్‌స్టోరీ చాలా ప్రామిసింగ్‌గా మొదలవుతాయి. ముఖ్యంగా తల్లీకొడుకుల మధ్య ఉండే ఎమోషన్, ప్రీ-ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు వచ్చే యాక్షన్ ఎపిసోడ్లు మాస్ ప్రేక్షకులకు అదిరిపోయే హై ఇస్తాయి. ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి ఒక మాస్ జాతర చూసిన అనుభూతి కలుగుతుంది.
అయితే, సెకండాఫ్‌కు వచ్చేసరికి దర్శకుడు కథనంపై పట్టు కోల్పోయాడు. ఇంటర్వెల్ ఇచ్చిన భారీ హై తర్వాత కథను ముందుకు నడిపించడంలో తడబాటు స్పష్టంగా కనిపిస్తుంది. శిఖంజ మాలిక్‌గా మోహన్ బాబు, జడల్‌గా నాని మధ్య వచ్చే ఫేస్-ఆఫ్ సీన్లు పేలవంగా సాగాయి. విలన్ పాత్రను మాటల్లో భయంకరంగా చూపించారు తప్ప, సన్నివేశాల్లో ఆ క్రూరత్వం తెరపై బలంగా పండలేదు. విలనిజం తేలిపోవడంతో హీరో చేసే పోరాటం, ఇచ్చే ఎలివేషన్లలో ఎమోషన్ లోపించింది.
దానికితోడు  సెకండ్ హాఫ్ లో అనవసరపు రాజకీయ కోణాలు ఇరికించడం, పతాక సన్నివేశాలు (క్లైమాక్స్) కూడా రొటీన్‌గా సాగడం మైనస్ అయ్యాయి. కథలోని ఎమోషన్‌ను పక్కనపెట్టి స్క్రీన్ నిండా రక్తపాతం, మితిమీరిన వయోలెన్స్‌పైనే ఎక్కువ ఆధారపడటం వల్ల సాధారణ, కుటుంబ ప్రేక్షకులకు ఇది కాస్త ఇబ్బందికరంగా మారుతుంది.
నటీనటుల పనితీరు
  • నాని: జడల్ పాత్ర కోసం నాని పడిన కష్టం ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. ఊర మాస్ లుక్‌లో, యాక్షన్ ఘట్టాల్లో జీవించేశాడు. అయితే నాని ఇమేజ్‌కు మించిన రక్తపాతం, ఓవర్-ది-టాప్ మాస్ భారం వల్ల కొన్ని చోట్ల పాత్ర భారంగా తోస్తుంది.
  • సోనాలి కులకర్ణి: సినిమాలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ సోనాలి కులకర్ణిదే. సమ్మక్కగా ఆమె నటన అద్భుతం. ఎమోషనల్ సీన్లలో ఆమె నానిని కూడా డామినేట్ చేసి సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.
  • మోహన్ బాబు: శిఖంజ మాలిక్‌గా తన డైలాగ్ డెలివరీతో ఉన్నంతలో గంభీరత తెచ్చినప్పటికీ, ఆయన స్థాయికి తగ్గ పవర్‌ఫుల్ సన్నివేశాలు పడలేదు.
  • కాయదు లోహర్: గ్లామర్ పరంగా, లుక్స్ పరంగా ఆకట్టుకుంది. అయితే ఆమె పాత్ర డిజైన్, లవ్ ట్రాక్ అంతగా అతకలేదు.
  • ఇతర పాత్రలు: రాఘవ్ జుయల్ లుక్ బాగున్నా పాత్ర పరిధి తక్కువ. ప్రియదర్శి కేసీఆర్ పాత్రలో కొంత జోష్ నింపగా, సంపూర్ణేష్ బాబు పాత్ర పరిమితం.

సాంకేతిక విభాగం

సినిమాకు నిజమైన రక్షకుడు అనిరుధ్ రవిచందర్. ‘ఆయా షేర్’, ‘యేషనాగుల’ పాటలతో పాటు నేపథ్య సంగీతంతో (BGM) థియేటర్లలో మోత మోగించాడు. కొన్ని చోట్ల లౌడ్ సౌండ్ అనిపించినా, చాలా సీన్లను అనిరుధ్ తన సంగీతంతోనే నిలబెట్టాడు. సీహెచ్ సాయి సినిమాటోగ్రఫీ టాప్ నాచ్. ప్యారడైజ్ మురికివాడలు, పీరియాడిక్ అట్మాస్ఫియర్‌ను తెరపై చాలా సహజంగా ఆవిష్కరించారు. నిర్మాత సుధాకర్ చెరుకూరి ఎక్కడా రాజీపడకుండా భారీ నిర్మాణ విలువలతో సినిమాను రూపొందించారు. నవీన్ నూలి ఎడిటింగ్ సెకండాఫ్‌లో మరింత షార్ప్‌గా ఉండాల్సింది.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల టేకింగ్, విజువల్ విజన్ బ్రిలియంట్‌గా ఉన్నప్పటికీ.. రైటింగ్ లో  ఎమోషన్‌ను మిస్సయ్యి కేవలం వయోలెన్స్‌నే నమ్ముకోవడం నిరాశపరుస్తుంది.

ప్లస్ పాయింట్లు..

  • నాని డెడికేషన్ & రా యాక్టింగ్
  • అనిరుధ్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ & పాటలు
  • సోనాలి కులకర్ణి భావోద్వేగ నటన
  • హై-వోల్టేజ్ ఇంటర్వెల్ బ్లాక్
  • భారీ ప్రొడక్షన్ వాల్యూస్ & సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్లు..

  • పట్టుతప్పిన సెకండాఫ్ & బలహీనమైన క్లైమాక్స్
  • శ్రుతిమించిన హింస (ఓవర్ డోస్ వయోలెన్స్)
  • విలన్ క్యారెక్టరైజేషన్‌లో బలం లేకపోవడం
  • తేలిపోయిన సవారీల ఎమోషనల్ డ్రైవ్ & పొలిటికల్ ట్రాక్
బాటమ్ లైన్..

మొదటి సగం పక్కా మాస్ హై ఇచ్చినా..  సెకండ్ హాఫ్ లో ఎమోషన్ తగ్గి వయోలెన్స్ ఎక్కువవడంతో ‘ది ప్యారడైజ్’ పూర్తిస్థాయిలో సంతృప్తిపరచలేక ఒక సాధారణ మాస్ ఎంటర్‌టైనర్‌గా మిగిలిపోతుంది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *