Bus Accident: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా పరిధి యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి మహోబా వెళ్తున్న ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సులో అకస్మాత్తుగా భారీ మంటలు చెలరేగడంతో తొమ్మిది మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. జేవార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దయానత్‌పూర్ సమీపంలో రాత్రి సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది. క్షణాల వ్యవధిలోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించడంతో తీవ్ర ప్రాణనష్టం వాటిల్లింది.
అర్ధరాత్రి వేళ వ్యాపించిన మంటలు.. ప్రాణభయంతో దూకేసిన ప్రయాణికులు..
రాజ్ కల్పనా ట్రావెల్స్‌కు చెందిన ఈ బస్సులో ప్రమాద సమయంలో సుమారు 35 నుంచి 40 మంది ప్రయాణికులు ఉన్నారు. రాత్రి వేళ ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా దట్టమైన పొగ, మంటలు బస్సును చుట్టుముట్టాయి. పరిస్థితిని గమనించిన పలువురు ప్రయాణికులు బస్సు అద్దాలు పగలగొట్టి కిటికీల నుంచి కిందకు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. మంటల వేగానికి, ఊపిరాడని పొగకు బయటకు రాలేక మహిళలు, వృద్ధులు సహా 9 మంది ప్రయాణికులు బస్సులోనే సజీవ దహనమయ్యారు.తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే జేవార్‌లోని కైలాష్ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రయాణికుల బ్యాగులు, ఫోన్లు, ఇతర సామగ్రి పూర్తిగా బూడిదయ్యాయి.
ఏసీ యూనిట్ పేలుడు – డ్రైవర్, కండక్టర్ల ఘోర నిర్లక్ష్యం..
అగ్నిమాపక సిబ్బంది ప్రాథమిక విచారణ ప్రకారం బస్సులోని ఏసీ (AC) యూనిట్ పేలడం వల్లే ఇంజిన్ భాగం నుంచి మంటలు వాహనమంతటా వేగంగా వ్యాపించాయని తెలుస్తోంది. బస్సు డ్రైవర్ క్యాబిన్ నుంచి కాలిపోతున్న వాసన రావడాన్ని గమనించి, బస్సును పక్కకు ఆపాలని ముందే కోరినట్లు ప్రాణాలతో బయటపడిన ప్రయాణికులు వెల్లడించారు. అయితే డ్రైవర్, కండక్టర్ ఆ హెచ్చరికలను నిర్లక్ష్యం చేస్తూ “ఇలాంటి వాసనలు సహజమే” అంటూ లైట్ తీసుకున్నారని ఆరోపించారు.
