Heavy Rains: బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం నిన్న అర్ధరాత్రి 11 నుంచి 1 గంటల మధ్యలో శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం దగ్గర తీరం దాటేసింది. చాలా నెమ్మదిగా కదలడం వల్ల ఉత్తరాంధ్ర అంతా వానలతో తడిసిముద్దవుతోంది. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో గంటకు 60 కిలోమీటర్లకు పైగా వేగంతో ఈదురుగాలులు వీస్తూ కుండపోత వర్షం పడుతోంది. దీంతో ముందుజాగ్రత్తగా ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇచ్చేసింది. ఈ వాయుగుండం మరో 12 గంటల పాటు ఇలాగే ఉండి, ఆ తర్వాత నెమ్మదిగా బలహీనపడుతుందని అధికారులు చెబుతున్నారు.
విశాఖలో దంచికొట్టిన వాన – నీటమునిగిన కాలనీలు..
రాష్ట్రంలో దాదాపు 80 చోట్ల 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడింది. ముఖ్యంగా విశాఖపట్నంలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. రోడ్లన్నీ చెరువుల్లా మారిపోయి జనజీవనం స్తంభించింది. ఎక్కడ ఎంత వాన పడిందంటే..
-
తులసీనగర్ (విశాఖ రూరల్): 236 మి.మీ. (అత్యధికం)
-
మధురవాడ: 218 మి.మీ.
-
ఎండాడ: 210 మి.మీ.
-
సీతమ్మధార: 205 మి.మీ.
-
కాపులుప్పాడ: 202 మి.మీ.
-
మహారాణిపేట: 199 మి.మీ.
-
కొత్తవలస: 188 మి.మీ.
-
పెందుర్తి: 179 మి.మీ.
-
బుచ్చిరాజుపాలెం: 171 మి.మీ.
మిగతా జిల్లాల్లోనూ భారీ వర్షాలు..
ఉత్తరాంధ్రతో పాటు గోదావరి, కృష్ణా జిల్లాల్లో కూడా గట్టిగానే వాన పడింది. లక్ష్మీనర్సుపేటలో 158 మి.మీ, కాకినాడలో 148 మి.మీ, తూర్పుగోదావరి గాడాలలో 146 మి.మీ, ఎన్టీఆర్ జిల్లా చంద్రాలో 133 మి.మీ, ముమ్మడివరంలో 132 మి.మీ వర్షం రికార్డయ్యింది. బలమైన గాలుల వల్ల చాలాచోట్ల చెట్లు, కరెంట్ స్తంభాలు నేలకూలి కరెంట్ పోయింది.
రాబోయే రెండు రోజులు మరింత జాగ్రత్త..
-
ఆకస్మిక వరదల ప్రమాదం:వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉంది కాబట్టి అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు.
-
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు:సముద్రం చాలా అల్లకల్లోలంగా ఉంది, అందుకే సెప్టెంబర్ 27 వరకు ఎవరూ వేటకు వెళ్లకూడదని తేల్చి చెప్పారు.
-
రంగంలోకి సహాయక బృందాలు:
ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సహాయం కోసం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల కోసం కంట్రోల్ రూమ్ టోల్‌ఫ్రీ నంబర్లను కూడా అందుబాటులో ఉంచారు.
