KTR: పోరాడితే పోయేదేమీలేదు… బానిస సంకెళ్లు తప్పా.. రైతు పోరాటంతో దిగొచ్చిన సర్కార్..

KTR: రైతుల నిరంతర ఆందోళనలు, పోరాటాల ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది. జూరాల ప్రాజెక్టు నుంచి ఎడమ, కుడి ప్రధాన కాలువలకు అధికారులు బుధవారం ఉదయం సాగునీటిని విడుదల చేశారు. పొలాలు ఎండిపోతున్న విపత్కర పరిస్థితుల్లో అన్నదాతలు చేపట్టిన ఉద్యమం ఫలించడంతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో స్పందించారు. “పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప!” అంటూ అన్నదాతల పోరాట పటిమను వేనోళ్ల కొనియాడారు.

కుంభకర్ణ ప్రభుత్వాన్ని ముల్లుగర్రతో తట్టి లేపారు.. కేటీఆర్ ఫైర్

ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఘాటైన విమర్శలు చేశారు.. జూరాల ప్రాజెక్టు నుంచి నీరందక పంటలు కళ్లముందే ఎండిపోతుంటే, రైతులు తమ హక్కుల సాధన కోసం రోడ్డెక్కి చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అభినందించారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఈ కుంభకర్ణ ప్రభుత్వాన్ని ముల్లుగర్రతో తట్టి నిద్రలేపి, నీటిని విడుదల చేసేలా పరుగులు పెట్టించిన రైతులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
అన్నదాతల కష్టాల్లో భాగస్వాములై, క్షేత్రస్థాయిలో వారితో కలిసి అడుగులు వేసి పోరాడిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

రానున్న రెండేళ్లు ప్రశ్నించడం.. పోరాడటమే మన కర్తవ్యం

తెలంగాణ ప్రజల కనీస అవసరాలను తీర్చే విధంగా ఈ ప్రభుత్వాన్ని పరుగులు పెట్టించడమే తమ ముందున్న మిగిలిన రెండేళ్ల కర్తవ్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం, తెలంగాణ హక్కుల రక్షణ కోసం నిరంతరం ప్రశ్నించడం, రాజీలేకుండా పోరాడటం, అవసరమైతే ఎవరితోనైనా కొట్లాడటమే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన లక్ష్యమని తేల్చిచెప్పారు. పంటలను కాపాడుకునేందుకు రైతులు, వారికి మద్దతుగా బీఆర్ఎస్ చేపట్టిన క్షేత్రస్థాయి ఒత్తిడి వల్లే ఎట్టకేలకు అధికారులు గేట్లు ఎత్తి సాగునీటిని వదలాల్సి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *