pawan kalyan

Pawan Kalyan: అభివృద్ధి జైత్రయాత్ర.. రూ.1,500 కోట్ల పనులకు శ్రీకారం..!

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో పర్యటించి గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా భారీ ఎత్తున అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పిఠాపురం నియోజకవర్గ రూపురేఖలను మార్చేలా సుమారు రూ. 1,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ఆయన అధికారికంగా ప్రారంభించారు. జలవనరుల పునరుద్ధరణతో పాటు పచ్చదనం పెంపొందించడానికి ప్రాధాన్యతనిస్తూ పలు ప్రాజెక్టులను ప్రజలకు అంకితం చేశారు.

మైసమ్మ ఆలయ దర్శనం – ఎఫ్.కే.పాలెం చెరువు ప్రారంభోత్సవం..

పర్యటనలో భాగంగా ఎఫ్.కే.పాలెంలోని మైసమ్మ ఆలయాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనాలు పలికి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. రూపురేఖలు మార్చి సుందరీకరించిన ఎఫ్.కే.పాలెం మైసమ్మ చెరువు అభివృద్ధి పనులను డిప్యూటీ సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా చెరువు మధ్యలో ఏర్పాటు చేసిన శివుని విగ్రహాన్ని దర్శించుకున్నారు.
11 చెరువుల అభివృద్ధి పనులకు శ్రీకారం..
భూగర్భ జలాలు పెంచేందుకు, గ్రామీణ తాగు-సాగునీటి అవసరాల కోసం నియోజకవర్గంలోని మరో 11 చెరువుల అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.
రూ. 1.82 కోట్లతో ‘పీఠికాపుర వనం’ – పిల్లలతో కలిసి పార్క్ ప్రారంభం

ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునేలా సుమారు రూ. 1.82 కోట్ల వ్యయంతో తీర్చిదిద్దిన ప్రత్యేక పర్యావరణ పార్క్ ‘పీఠికాపుర వనం’ను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. వనం ప్రాంగణంలో చిన్నారులతో కలిసి పార్కును సందర్శించిన ఆయన, స్థానిక పిల్లలతో సరదాగా ముచ్చటిస్తూ కాసేపు గడిపారు. ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చదనం ప్రజల మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. తాగునీటి వ్యవస్థలు, డ్రైనేజీలు, రోడ్ల విస్తరణతో పాటు స్థానిక ఆధ్యాత్మిక, పర్యాటక రంగాల సమగ్ర పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *