Gondhal: ప్రతిష్టాత్మక 99వ అకాడమీ అవార్డుల (Oscars 2027) కోసం భారత్ తరఫున ‘ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్’ (Best International Feature Film) విభాగంలో ప్రాతినిధ్యం వహించే అధికారిక చిత్రంగా మరాఠీ జానపద థ్రిల్లర్ ‘గోంధల్’ (Gondhal) ఎంపికైంది. ఈ విషయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) అధికారికంగా వెల్లడించింది. ప్రముఖ దర్శకుడు పి. శేషాద్రి నేతృత్వంలోని జ్యూరీ కమిటీ దేశవ్యాప్తంగా వచ్చిన 33 ఎంట్రీలను పరిశీలించి ఏకగ్రీవంగా ఈ చిత్రాన్ని ఖరారు చేసింది.
‘గోంధల్’ కథా నేపథ్యం – ప్రత్యేకత..
ఒక్క రాత్రిలో జరిగే కథ..
మహారాష్ట్ర గ్రామీణ నేపథ్యంలో జరిగే సంప్రదాయ అర్ధరాత్రి ఆచార ప్రదర్శన ‘గోంధల్’ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. సంగీతం, జానపద నృత్యం, పౌరాణిక గాథలతో కూడిన ఈ వేడుక రాత్రంతా సాగుతుంది.
ఆనంద్ అనే సంపన్నుడితో బలవంతపు వివాహం చేసుకుని అసంతృప్తిగా ఉన్న సుమన్ అనే మహిళ జీవితం ఆధారంగా ఇది తెరకెక్కింది. గోంధలి కళాకారుడు సాహెబాతో ప్రేమలో పడిన ఆమె.. ఆ పెళ్లి బంధం నుంచి బయటపడేందుకు వేసే పథకం, హత్య, మోసం, ప్రతీకారం మరియు మనుగడల పోరాటంగా తీవ్ర ఉత్కంఠభరితమైన థ్రిల్లర్‌గా రూపొందింది.
సంతోష్ దవాఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2025 నాటి 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో బెస్ట్ డైరెక్టర్‌గా ‘సిల్వర్ పీకాక్’ పురస్కారాన్ని దక్కించుకుంది. ఇందులో ఇషితా దేశ్‌ముఖ్, కిశోర్ కదమ్, యోగేశ్ సోహోని, నిషాద్ భోయిర్ ప్రధాన పాత్రలు పోషించారు.
ఆస్కార్ రేసులో నిలిచిన 4వ మరాఠీ సినిమా..
ఆస్కార్ వేదికపై భారత్ తరఫున అధికారికంగా పోటీపడుతున్న నాల్గవ మరాఠీ చిత్రంగా ‘గోంధల్’ చరిత్రకెక్కింది. గతంలో..
-
శ్వాస్ (Shwaas) – 2005
-
హరిశ్చంద్రాచి ఫ్యాక్టరీ (Harishchandrachi Factory) – 2009
-
కోర్ట్ (Court) – 2015
గత ఏడాది 98వ అకాడమీ అవార్డుల కోసం నీరజ్ ఘైవాన్ రూపొందించిన హిందీ చిత్రం ‘హోమ్‌బౌండ్’ (Homebound) ఎంపికైనప్పటికీ నామినేషన్ల షార్ట్‌లిస్ట్‌కు చేరుకోలేకపోయింది.
33 భారీ చిత్రాలను వెనక్కినెట్టి ఎంపిక..
ఈసారి ఆస్కార్ ఎంట్రీ రేసులో 14 హిందీ, తెలుగు, తమిళం, గుజరాతీ, మలయాళం సహా మొత్తం 33 చిత్రాలు నిలిచాయి. దిల్జిత్ దోసాంజ్ నటించిన ‘మై వాపస్ ఆవూంగా’, సన్నీ డియోల్ ‘బోర్డర్ 2’, రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’, ‘120 బహదూర్’, ‘గాంధీ టాక్స్’, ‘పెద్ది’ వంటి బడా చిత్రాలు పోటీపడినప్పటికీ జ్యూరీ మాత్రం గ్రామీణ జానపద సంస్కృతిని శక్తివంతంగా చూపించిన ‘గోంధల్’కే పట్టం కట్టింది.
99వ ఆస్కార్ ఈవెంట్ షెడ్యూల్..
-
వేదిక: డాల్బీ థియేటర్, లాస్ ఏంజిల్స్ (హాలీవుడ్)
-
నామినేషన్ల ప్రకటన: 2027 జనవరి 21
-
అవార్డుల ప్రదానోత్సవం: 2027 మార్చి 14 (హోస్ట్‌గా కోనన్ ఓ’బ్రియన్)
