Crime News

Crime News: పెళ్లయిన 18 రోజులకే బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య.. అదనపు కట్నం వేధింపులే కారణం..!

Crime News: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహమై కేవలం 18 రోజులు కూడా గడవకముందే అదనపు కట్న పిశాచి ఓ నవవధువు నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పోలీస్ శాఖలో పనిచేస్తున్న భర్త నుంచి ఎదురైన శారీరక, మానసిక వేధింపులను తట్టుకోలేక 20 ఏళ్ల బీటెక్ విద్యార్థిని తాను చదువుతున్న కళాశాల భవనం పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది.
పెళ్లయిన నాటి నుంచే వేధింపులు..
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన ఏనుగు మధుసూదన్ రెడ్డి కుమార్తె పల్లవి (20). ఆమె ఘట్‌కేసర్ మండలం ఘనపూర్‌లోని కేపీఆర్‌ఐటీ (KPRIT) కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఆగస్టు 30న హైదరాబాద్‌లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్ రెడ్డితో పల్లవికి వివాహం జరిగింది. పెళ్లయిన కొద్ది రోజులకే కానిస్టేబుల్ శ్రీకాంత్ రెడ్డి అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్య పల్లవిపై ఒత్తిడి తేవడం ప్రారంభించాడు. రోజురోజుకూ శారీరకంగా, మానసికంగా వేధింపులు తీవ్రతరం కావడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది.
కళాశాల 3వ అంతస్తు పైనుంచి దూకి..
నిత్యం సాగుతున్న వేధింపులను భరించలేని పల్లవి, తీవ్ర నిరాశతో తాను చదువుతున్న ఇంజనీరింగ్ కాలేజీ భవనం మూడో అంతస్తు పైనుంచి కిందికి దూకేసింది. తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. చేతికందివచ్చిన కూతురు పెళ్లయిన కొన్ని రోజులకే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
మృతురాలి తల్లి సంధ్య ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు ఘట్‌కేసర్ పోలీసులు కానిస్టేబుల్ శ్రీకాంత్ రెడ్డిపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభించారు.

(గమనిక: ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదు. మానసిక వేదన, ఒత్తిడి ఎదురైతే నిపుణుల సలహాలు పొందండి. తెలంగాణ స్నేహ హెల్ప్‌లైన్: 040-68205345).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *