KTR Pro Mahesh

KTR Pro Mahesh: సైఫాబాద్ పీఎస్ ఎదుటే కేటీఆర్ పీఆర్వో మహేష్ అరెస్ట్

KTR Pro Mahesh: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్వో మహేష్ మాణిక్య (మహేష్ ముదిరాజ్)ను గురువారం రాత్రి బొల్లారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 8న బొల్లారం చెక్‌పోస్టు వద్ద శాంతిభద్రతల విధుల్లో ఉన్న పోలీస్ అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించి, వారి విధులకు తీవ్ర ఆటంకం కలిగించారనే ఆరోపణలపై నమోదైన కేసులో ఈ అరెస్ట్ జరిగింది.

అసెంబ్లీ గేటు వద్ద పోలీసులను అవమానించారనే మరో పాత కేసు విచారణ కోసం కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డితో కలిసి సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు హాజరైన మహేష్, తన వాంగ్మూలం నమోదు చేసుకుని స్టేషన్ నుంచి బయటకు రాగానే బొల్లారం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఎస్‌ఐ ఫిర్యాదులో పేర్కొన్న పూర్తి వివరాలు..
శాసనసభ సమావేశాల వేళ శాంతిభద్రతల పరిరక్షణ కోసం మల్కాజ్‌గిరి డీసీపీ సి.హెచ్. శ్రీధర్, బేగంపేట ఏసీపీ ఆర్. గోపాలకృష్ణమూర్తి, బొల్లారం ఎస్‌హెచ్‌ఓ ఎన్. రామలక్ష్మణరాజు, ఎస్‌ఐ సన్నీ తదితరులు బొల్లారం చెక్‌పోస్టు వద్ద బందోబస్తులో ఉన్నారు. ఆ సమయంలో కేటీఆర్, హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్ (కోరుట్ల), జి. జగదీశ్ రెడ్డి (సూర్యాపేట), పాడి కౌశిక్ రెడ్డి (హుజూరాబాద్), పల్లా రాజేశ్వర్ రెడ్డి (జనగాం) కాన్వాయ్‌తో ఎర్రవల్లి వైపు వెళ్లేందుకు యత్నించారు. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు కాన్వాయ్ వాహనాలను ఆపి ముందుకు వెళ్లవద్దని కోరినా నేతలు వినకుండా ముందుకు కదిలేందుకు ప్రయత్నించారు.
ఏసీపీ, ఎస్‌ఐలపై దాడి – పలుమార్లు తోసివేత..
ఈ క్రమంలో కేటీఆర్ పీఆర్వో మహేష్ ఉన్నతాధికారుల వద్దకు దూసుకొచ్చి బేగంపేట ఏసీపీ, ఎస్‌ఐ సన్నీలతో వాగ్వాదానికి దిగడమే కాకుండా, వారిపై తీవ్ర పదజాలంతో అరుస్తూ పలుమార్లు చేతులతో నెట్టివేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉన్న యూనిఫాం అధికారులను భౌతికంగా అడ్డుకుని చేతులతో తోసివేయడంతో ఏసీపీ కిందపడిపోయారని తెలిపారు.
బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసులు – స్టేషన్ వద్ద హైటెన్షన్..
నమోదైన సెక్షన్లు..
ఎస్‌ఐ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు.. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 132 (ప్రభుత్వ ఉద్యోగి విధులను అడ్డుకునేందుకు దాడి చేయడం లేదా నేరపూరిత బలాన్ని ప్రయోగించడం), సెక్షన్ 223 (ప్రభుత్వ ఉద్యోగి జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించడం) కింద కేసు నమోదు చేశారు.

 

సైఫాబాద్ పీఎస్ ఎదుట ఉద్రిక్తత..
సైఫాబాద్ పీఎస్ వద్ద మహేష్‌ను అదుపులోకి తీసుకుంటున్న సమయంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మహేష్‌ను సైఫాబాద్‌లోనే విచారించాలని నిబంధనలు ఉన్నాయంటూ పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కాసేపు తోపులాట, ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు ఆయనను బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *