Crime News: నిజామాబాద్ నగరంలో పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య జరిగింది. ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి భర్త చిత్తరి హరిబాబు (26)ను గుర్తుతెలియని దుండగులు రాజరాజేంద్ర జంక్షన్ వద్ద కొబ్బరిబోండాల కత్తితో అతి కిరాతకంగా నరికి చంపారు. గతంలో గర్భిణిగా ఉన్న భార్య వైష్ణవిని హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉండి ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చిన హరిబాబును ప్రతీకారంతోనే హతమార్చినట్లు వెల్లడైంది. తన చెల్లెలిని చంపినందుకే హరిబాబును తానే చంపినట్లు వైష్ణవి సోదరుడు సంతోష్ సెల్ఫీ వీడియో విడుదల చేసి పోలీసులకు లొంగిపోవడం తీవ్ర కలకలం రేపింది.
వైష్ణవి సోదరుడు సంతోష్ ఒక సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశాడు. “గర్భవతి అని కూడా చూడకుండా నా చెల్లిని దారుణంగా చంపినందుకు ప్రతీకారంగానే హరిబాబును నేనే మట్టుబెట్టాను” అని ఆ వీడియోలో పేర్కొన్నాడు. అనంతరం సంతోష్ నేరుగా కోరుట్ల పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పక్కా రెక్కీ నిర్వహించే ఈ పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
