Central Cabinet Decision: దేశంలోని ప్రైవేట్ రంగ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్ – EPF) గరిష్ఠ వేతన పరిమితిని భారీగా పెంచుతూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నెలకు రూ.15,000గా ఉన్న ఈపీఎఫ్ వేతన పరిమితిని ఏకంగా రూ.25,000కు పెంచే ప్రతిపాదనకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదముద్ర వేసింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.
12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర..
చివరిసారిగా 2014లో కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ వేతన పరిమితిని రూ.6,500 నుంచి రూ.15,000కు సవరించింది. ఆ తర్వాత నిత్యావసరాల ఖర్చులు, జీవన వ్యయం గణనీయంగా పెరిగినప్పటికీ గత 12 ఏళ్లుగా ఈ పరిమితి పెరగలేదు. ప్రస్తుత కాలానికి అనుగుణంగా వేతన పరిమితిని కనీసం రూ.25,000కు పెంచాలని కొన్నేళ్లుగా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తాజా కేబినెట్ నిర్ణయంతో ఉద్యోగ, కార్మిక వర్గాల చిరకాల వాంఛ నెరవేరినట్లయింది.
51 లక్షల మందికి లబ్ధి – సామాజిక భద్రత..
ఈ నిర్ణయం వల్ల అదనంగా 51 లక్షల మందికి పైగా కొత్త ఉద్యోగులు చట్టబద్ధమైన ఈపీఎఫ్‌ఓ (EPFO) పరిధిలోకి రానున్నారని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.11,339 కోట్లు వెచ్చించనుంది.
పెన్షన్, ఈడీఎల్‌ఐ బీమా ప్రయోజనాలు..
ప్రస్తుతం రూ.15,000 కంటే ఎక్కువ జీతంతో ఉద్యోగంలో చేరినవారు ఆటోమేటిక్‌గా ఈపీఎఫ్ పరిధిలోకి రాలేకపోతున్నారు. యాజమాన్యంతో ఒప్పందం ఉంటేనే తప్ప పీఎఫ్ సదుపాయం అందేది కాదు. ఇకపై రూ.15,000 నుంచి రూ.25,000 మధ్య వేతనం పొందే ఉద్యోగులందరికీ తప్పనిసరిగా ప్రావిడెంట్ ఫండ్ (PF), ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS), ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) ద్వారా బీమా రక్షణ వంటి సమగ్ర సామాజిక భద్రత లభించనుంది.
చందా లెక్కింపు ఎలా మారనుంది?
ఇప్పటివరకు రూ.15,000 పరిమితి ప్రకారం బేసిక్ వేతనంలో 12 శాతం అంటే గరిష్ఠంగా నెలకు రూ.1,800 పీఎఫ్ చందాగా కట్ అయ్యేది. ఇప్పుడు వేతన పరిమితిని రూ.25,000కు పెంచడంతో, ఉద్యోగి తరఫున గరిష్ఠంగా నెలకు రూ.3,000 వరకు పీఎఫ్ కాంట్రిబ్యూషన్ వెళ్తుంది. దీనికి సమానంగా యాజమాన్యం కూడా తమ వాటా జమ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఉద్యోగుల పదవీ విరమణ నిధి భారీగా పెరుగుతుంది. కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో, దీనికి సంబంధించిన అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ను కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ అతి త్వరలోనే విడుదల చేయనుంది.
