Governor Convoy: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌కు పెను ప్రమాదం తృటిలో తప్పింది. నిన్న రాత్రి కృష్ణా జిల్లా పర్యటన ముగించుకుని తిరిగి వస్తుండగా ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆకస్మికంగా కాన్వాయ్ వాహనాలకు అడ్డుగా రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే, కాన్వాయ్ పైలట్ వాహన డ్రైవర్, భద్రతా సిబ్బంది అత్యంత అప్రమత్తతతో వ్యవహరించడంతో గవర్నర్ సురక్షితంగా బయటపడ్డారు.
మచిలీపట్నం గణపతి దర్శనం ముగించుకుని వస్తుండగా ఘటన..
అకస్మాత్తుగా వాహనాలకు ఎదురుగా వ్యక్తి రావడాన్ని గమనించిన పైలట్ వాహన డ్రైవర్, కాన్వాయ్ భద్రతా సిబ్బంది క్షణాల్లో స్పందించారు. అత్యంత సమయస్ఫూర్తితో వాహనాలను నియంత్రించడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనతో అక్కడున్న అధికారులు, స్థానికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కాన్వాయ్‌కు అడ్డుగా వచ్చిన ఆ వ్యక్తిని వెంటనే భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి కావాలనే అడ్డువచ్చాడా? మానసిక స్థితి సరిగా లేదా? లేక ఏదైనా నిరసన తెలిపేందుకు వచ్చాడా? అనే కోణాల్లో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. భద్రతా సిబ్బంది సకాలంలో అప్రమత్తం కావడం వల్లే పెద్ద ముప్పు తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
