YSRCP

YSRCP: వైసీపీలో చేరిన 4 నెలలకే వేటు.. రేపల్లె నేత మోపిదేవి శ్రీనివాసరావు సస్పెన్షన్..!

YSRCP: బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గ వైసీపీలో అనూహ్య రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీని వీడి నాలుగు నెలల క్రితమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ నేత మోపిదేవి శ్రీనివాసరావుపై వైసీపీ అధిష్ఠానం సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తప్పిస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫార్సులతో వేటు..

రేపల్లె నియోజకవర్గంలో మోపిదేవి శ్రీనివాసరావు పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నారని, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని స్థానిక శ్రేణుల నుంచి అధిష్ఠానానికి ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులపై విచారణ చేపట్టిన వైసీపీ క్రమశిక్షణా కమిటీ, ఆయనపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. కమిటీ నిర్ణయం మేరకు మోపిదేవి శ్రీనివాసరావును తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కేంద్ర కార్యాలయం ప్రకటించింది.
4 నెలల క్రితమే చేరిక – జగన్ ఇచ్చిన హామీలేంటి?
ఈ ఏడాది మే 14న తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో మోపిదేవి శ్రీనివాసరావు తన అనుచరులతో కలిసి కాంగ్రెస్‌ను వీడి వైసీపీలో చేరారు. ఆ సమయంలో జగన్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. “మోపిదేవి శ్రీనివాసరావు మా కుటుంబ సభ్యుడిగా పార్టీలోకి వచ్చారు. నాపై నమ్మకంతో వచ్చినందుకు ఆయనకు అన్ని విధాలా న్యాయం చేస్తాను” అని జగన్ భరోసా ఇచ్చారు.

రేపల్లె పార్టీ సమన్వయకర్తగా ఉన్న మోహన్‌ను గెలిపించే బాధ్యతను మోపిదేవి శ్రీనివాసరావు తీసుకోవాలని, ఆయన చేసే సేవలను గుర్తించి భవిష్యత్తులో చట్టసభల్లో కుర్చీ వేసి కూర్చోబెడతానని స్వయంగా జగన్ ప్రకటించారు. అలా పార్టీలోకి వచ్చిన నాలుగు నెలల వ్యవధిలోనే, ఏకంగా క్రమశిక్షణా చర్యల పేరుతో ఆయనపై వేటు పడటం బాపట్ల జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *