Chandrababu: కలియుగ వైకుంఠమైన తిరుమల గిరుల్లో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల కోలాహలం మొదలైంది. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు అంగరంగ వైభవంగా జరగనున్న ఈ వార్షిక వేడుకలకు సోమవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం పూర్తయింది. ఈ పవిత్ర ఉత్సవాల వేళ మంగళవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్‌తో కలిసి కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ వేంకటేశ్వరస్వామికి సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ సందర్భంగా తిరుమలలో రెండు రోజుల పాటు పలు ఆధ్యాత్మిక, ప్రజాహిత అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు.
శాస్త్రోక్తంగా అంకురార్పణ – నేడు ధ్వజారోహణం..
-
సాయంత్రం 5:30: అమరావతి నుంచి బయలుదేరి తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వ్యవసాయ కళాశాల హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
-
సాయంత్రం 6:20: రోడ్డు మార్గాన తిరుమలకు చేరుకుని గాయత్రీ నిలయం అతిథి గృహంలో బస చేస్తారు.
-
రాత్రి 7:40: బేడి ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకుని, అక్కడి నుంచి ప్రభుత్వం తరఫున తీసుకువచ్చిన పట్టువస్త్రాలను మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకెళ్తారు.
-
రాత్రి 7:55 – 9:00: శ్రీవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
-
క్యాలెండర్లు, యాప్‌ల ఆవిష్కరణ: స్వామివారి దర్శనానంతరం టీటీడీ 2027 డైరీలు, క్యాలెండర్లతో పాటు భక్తుల సౌకర్యార్థం రూపొందించిన ‘నందకం యాప్’, భక్తుల గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాలను సీఎం ప్రారంభిస్తారు.
-
రాత్రి 9:00: బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి వాహనమైన పెద్దశేష వాహన సేవలో పాల్గొంటారు.
రేపటి (16-09-2026) పర్యటన వివరాలు..
-
ఉదయం 8:40: వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లోని 17వ కంపార్ట్మెంట్లో నూతనంగా తీర్చిదిద్దిన ‘పిల్గ్రిమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్’ను ప్రారంభిస్తారు.
-
ఉదయం 9:15: గోగర్భం డ్యామ్ సర్కిల్ వద్ద సరికొత్త రిలయన్స్ ఎలక్ట్రిక్ (ఈవీ) బస్సులకు పచ్చజెండా ఊపుతారు.
-
ఉదయం 9:35 – 10:20: అత్యాధునికంగా పునర్నిర్మించిన చారిత్రాత్మక ఎస్వీ మ్యూజియంను ప్రారంభించి పరిశీలిస్తారు.
-
ఉదయం 11:30: అన్నమయ్య భవనంలో తిరుమల అభివృద్ధి, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఉన్నతాధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.
-
మధ్యాహ్నం 2:00: తిరుమల పర్యటన ముగించుకుని తిరిగి అమరావతికి పయనమవుతారు.
భక్తుల కోసం విశేష ఏర్పాట్లు – ఫల, పుష్ప ప్రదర్శన..
