Gurugram

Gurugram: మహిళా బైకర్‌ను కారుతో గుద్దేసిన నిందితుడు అరెస్ట్..!

Gurugram: దేశ రాజధాని పరిధిలోని గురుగ్రామ్‌లో మహిళా బైకర్‌ను వెంబడించి కారుతో ఢీకొట్టిన హిట్ అండ్ రన్ కేసులో కీలక పురోగతి లభించింది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న పోలీసులు.. నిందితుడిని ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు కల్యాణ్ బైస్లాను రాజస్థాన్‌లోని దౌసాలో గురుగ్రామ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై హత్యాయత్నం (Attempt to Murder) సహా పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై బరితెగింపు – అసలు ఏం జరిగిందంటే?
సియా అనే యువతి తన బైకర్ గ్రూప్‌తో కలిసి గురుగ్రామ్‌లోని ప్రముఖ ‘గోల్ఫ్ కోర్స్ రోడ్’ మీదుగా ఏప్రిలియా (Aprilia RS 457) స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తుండగా ఈ దారుణం చోటుచేసుకుంది. మారుతి సుజుకి సియాజ్ కారులో వచ్చిన కల్యాణ్ బైస్లా మద్యం మత్తులో దూకుడుగా ప్రవర్తిస్తూ బైక్‌ను ఆపాలని వేధించాడు.

తన వెంటపడొద్దని, వాహనానికి కొంత దూరం పాటించాలని సియా హెచ్చరించడంతో పాటు ఆమె స్నేహితులు వారించినా వినకుండా మరింత రెచ్చిపోయాడు. సియా బైక్‌ను ఓవర్‌టేక్ చేసి, కావాలనే అడ్డంగా కారును తిప్పి సైడ్ నుంచి బలంగా గుద్దేశాడు. దీంతో సియా బైక్‌పై నుంచి ఎగిరి రోడ్డుపై పడి తీవ్ర గాయాలపాలైంది. బైక్ రోడ్డుపై కొద్ది దూరం వరకు ఈడ్చుకెళ్లింది.

కెమెరాలో రికార్డైన దృశ్యాలు – నెటిజన్ల ఆగ్రహం..

ప్రమాదం జరిగిన వెంటనే కారు అక్కడి నుంచి పరారైంది. సియా స్నేహితులు వెంబడించి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పట్టుకుని ప్రశ్నించగా, తన తప్పేమీ లేదంటూ దుర్భాషలాడుతూ అక్కడి నుంచి కారుతో పారిపోయాడు.

ఈ మొత్తం తతంగం బాధితురాలి బైక్‌కు ఉన్న యాక్షన్ కెమెరాలో స్పష్టంగా రికార్డైంది. బాధితురాలు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్న నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తాయి.

ఆర్మీ జవాన్ కారుతో నేరం – రాజస్థాన్‌లో పట్టివేత..

  • కారు వివరాలు:
    కారు నంబర్ (HR30Y4949) ఆధారంగా దర్యాప్తు చేయగా, అది హర్యానా పల్వాల్‌కు చెందిన ఆర్మీ ఉద్యోగి మనీష్ పేరిట ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం అసోంలో విధుల్లో ఉన్న మనీష్.. ఆదివారం తన స్నేహితుడైన కల్యాణ్ బైస్లా తన కుటుంబం వద్ద నుంచి కారు తీసుకెళ్లాడని స్పష్టం చేశాడు.
  • దౌసాలో అరెస్ట్:

    కారు నడిపిన నిందితుడు కల్యాణ్ బైస్లాగా నిర్ధారించుకున్న గురుగ్రామ్ పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించి, రాజస్థాన్‌లోని దౌసాలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. మహిళ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టినందుకు గాను అతడిపై కఠిన సెక్షన్లు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *