Viksit Bharat Ganesh: భాగ్యనగరంలో వినాయక చవితి అంటేనే సృజనాత్మకతకు పెట్టింది పేరు. భక్తితో పాటు సమకాలీన అంశాలు, దేశభక్తిని మేళవిస్తూ వినూత్న రీతుల్లో గణనాథులను తీర్చిదిద్దడంలో నగర యువత ఎప్పుడూ ముందే ఉంటుంది. తాజాగా పాతబస్తీ ఉప్పుగూడ లలితాబాగ్‌లో కొలువుదీరిన ‘వికసిత్ భారత్ గణపతి’ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటూ సరికొత్త ట్రెండ్‌గా నిలుస్తున్నాడు. మెటాలిక్ ఆర్మోర్ (కవచం) ధరించి, సైనికులను తలపించేలా రోబోటిక్ మూషిక వాహనాలు ముందు నిలబడి ఉండగా దర్శనమిస్తున్న ఈ బొజ్జ గణపయ్య ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారాడు.
50వ వార్షికోత్సవం వేళ వినూత్న థీమ్..
ఉప్పుగూడ లలితాబాగ్‌లోని మల్లికార్జున నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ తమ 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ప్రత్యేకమైన మండపాన్ని రూపొందించింది.
ఈ గ్రాండ్ శోభాయాత్రలో రోబోటిక్ మూషికాలతో పాటు, ఆధునిక భారతదేశ ప్రగతికి ప్రతీకగా మినీ బుల్లెట్ ట్రైన్ మోడల్, భారతీయ గ్రామీణ మూలాలను ప్రతిబింబించే ఎడ్లబండిలను కూడా ప్రత్యేక ఆకర్షణగా ప్రదర్శించనున్నట్లు అసోసియేషన్ సభ్యులు సుశీల్ కుమార్ వెల్లడించారు. సాంకేతికత, భక్తి, జాతీయ దృక్పథాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చిన లలితాబాగ్ గణపతిని దర్శించుకునేందుకు స్థానికులతో పాటు నగరవాసులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
