Crime News

Crime News: ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ గొంతు కోసి హత్య.. నగల కోసమేనని నమ్మించే యత్నం..!

Crime News: గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెనిగండ్లలో ఈ నెల 7న జరిగిన దాది కోటేశ్వరమ్మ అనే మహిళ హత్య కేసు మిస్టరీని పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను చంపి, నగదు, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లడంతో మొదట ఇదొక దోపిడీ హత్యగానే అంతా భావించారు. అయితే లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అత్యంత విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కొడుకు ప్రేమ వివాహానికి అడ్డుపడుతోందన్న కక్షతోనే పథకం ప్రకారం ఆమెను హతమార్చినట్లు నిర్ధారించారు.ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను డీఎస్పీ మురళీకృష్ణ మీడియాకు వెల్లడించారు.

అసలేం జరిగింది? – హత్యకు దారితీసిన కారణాలు..

వెనిగండ్లకు చెందిన దాది కోటేశ్వరమ్మ దాదాపు ఇరవై ఏళ్ల క్రితమే భర్తతో విడాకులు తీసుకుని తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తోంది. కుమార్తెకు పెళ్లి కావడంతో అత్తగారింట్లో ఉంటోంది. మెకానిక్‌గా పనిచేస్తున్న కుమారుడు సాదిక్‌తో కలిసి ఆమె ఇంట్లో ఉంటోంది. సాదిక్ అదే ప్రాంతానికి చెందిన మరియకుమారి కుమార్తెను ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే కులాలు వేరు కావడంతో ఈ పెళ్లికి కోటేశ్వరమ్మ ససేమిరా ఒప్పుకోలేదు.
రెండుసార్లు విఫలయత్నం – మూడోసారి స్కెచ్..
తన కూతురి పెళ్లికి అడ్డుగా నిలుస్తోందన్న కోపంతో మరియకుమారి ఎలాగైనా కోటేశ్వరమ్మను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఆమెను చంపేందుకు గతంలో రెండుసార్లు విఫలయత్నం చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
సినిమా ఫక్కీలో హత్య – నగల దోపిడీ డ్రామా..
ఈ నెల 7న కోటేశ్వరమ్మ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి మరియకుమారి తనకు తెలిసిన ఇద్దరు యువకులతో కలిసి స్కెచ్ వేసింది. ముందుగా మరియకుమారి కోటేశ్వరమ్మ ఇంట్లోకి ప్రవేశించింది.ఆ తర్వాత వెనుకే లోపలికి ప్రవేశించిన ఇద్దరు యువకులు కోటేశ్వరమ్మ కాళ్లు, చేతులు బలంగా పట్టుకోగా.. గొంతు కోసి అత్యంత కిరాతకంగా ప్రాణాలు తీశారు.హత్య అనంతరం దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, నగదును తీసుకుని పరారయ్యారు. దొంగలే బంగారు నగల కోసం హత్య చేసినట్లుగా సీన్‌ను క్రియేట్ చేశారు.
సీసీ కెమెరాలతో గుట్టురట్టు – నిందితుల అరెస్ట్..

కేసు నమోదు చేసుకున్న పెదకాకాని పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానితుల కదలికల ఆధారంగా కూపీ లాగడంతో మరియకుమారి, ఆమెకు సహకరించిన ఇద్దరు యువకుల బండారం బయటపడింది. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి హత్య తర్వాత ఎత్తుకెళ్లిన బంగారు ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *