BRS MLAs: తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో ఇటీవల చోటుచేసుకున్న ఉద్రిక్తతలు, తోపులాటల వ్యవహారం ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. అసెంబ్లీ గేట్ నంబర్ 3 వద్ద నిరసన సందర్భంగా తమపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని, దాడి చేశారని ఆరోపిస్తూ ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి (BRS) నేతలు జాతీయ స్థాయి కమిషన్లను ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై అధికారికంగా ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల బృందం గురువారం రాత్రికే హస్తినకు చేరుకుంది.
హస్తినకు చేరిన బీఆర్ఎస్ ప్రతినిధి బృందం..
ఈ బృందంలో పలువురు సీనియర్ నాయకులు, మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నారు..
-
మాజీ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి
-
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి
-
మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
-
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి
-
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
-
ఎమ్మెల్సీ సురభి వాణీదేవి
-
మాజీ కార్పొరేషన్ చైర్మన్ సోమ భరత్ కుమార్ తదితరులు.
జాతీయ మహిళా కమిషన్, ఎన్హెచ్ఆర్సీకి నేడు ఫిర్యాదు..
అసెంబ్లీ ఎదుట శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సమయంలో మహిళా ఎమ్మెల్యేలని చూడకుండా పోలీసులు బలప్రయోగం చేశారని, తమపై దురుసుగా ప్రవర్తించి భౌతిక దాడికి దిగారని జాతీయ మహిళా కమిషన్ (NCW) చైర్పర్సన్కు నేరుగా ఫిర్యాదు చేయనున్నారు. ప్రజాప్రతినిధుల హక్కులను కాలరాస్తూ శాసనసభలోకి వెళ్లకుండా అడ్డుకున్నారని, ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేసే హక్కును ప్రభుత్వం హరించిందని జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) దృష్టికి తీసుకెళ్లనున్నారు.
చర్యలకు డిమాండ్..
సంఘటన జరిగిన తీరు, వీడియో ఆధారాలను కమిషన్లకు సమర్పించి, సంబంధిత పోలీస్ అధికారులు, దీని వెనుక ఉన్న వారిపై సమగ్ర విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేయనున్నారు. రాష్ట్ర శాసనసభలో చెలరేగిన రాజకీయ వివాదం ఇప్పుడు జాతీయ స్థాయి వేదికల వరకు వెళ్లడంతో తెలంగాణ రాజకీయాల్లో మరింత ఉత్కంఠ నెలకొంది.
