KTR: బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ప్రయాణిస్తున్న వాహనానికి రాజీవ్ రహదారిపై తృటిలో పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు చౌరస్తా వద్ద ఆయన కాన్వాయ్‌లోని కారును వేగంగా వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ అనుకోని ఘటనలో వాహనం వెనుక డోర్ స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ, కేటీఆర్‌కు ఎలాంటి గాయాలు కాకుండా క్షేమంగా బయటపడటంతో అక్కడున్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఊపిరి పీల్చుకున్నారు.
రాఖీలు కడుతున్న సమయంలో అనూహ్య ఘటన..
కరీంనగర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీల అమలుపై నిర్వహించనున్న నిరసన సభకు కేటీఆర్ హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరారు. అలుగునూరు చౌరస్తా వద్ద మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ క్రేన్‌తో గజమాల వేసి ఆయనకు ఘన స్వాగతం పలికాయి.
స్వాగత కార్యక్రమం ముగిసిన అనంతరం పార్టీకి చెందిన పలువురు మహిళా నాయకురాళ్లు కేటీఆర్‌కు రాఖీలు కట్టారు. ఆ సమయంలో కేటీఆర్ కారులోకి ఎక్కి బయలుదేరేందుకు వాహనం వెనుక డోర్ తెరిచి ఉంచగా, పక్కనుంచి వెళ్తున్న ఓ లారీ వేగంగా వచ్చి కారు డోర్‌ను బలంగా ఢీకొట్టింది.
హఠాత్తుగా జరిగిన ఈ ఘటనతో అక్కడున్న కార్యకర్తలు, భద్రతా సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే డోర్ మినహా లోపల ఉన్న కేటీఆర్‌కు ఎటువంటి అపాయం జరగకపోవడంతో అంతా శాంతించారు.
పర్యటనను కొనసాగించిన కేటీఆర్..
ప్రమాదంలో కారు డోర్ దెబ్బతిన్నప్పటికీ కేటీఆర్ ఏమాత్రం వెనుకంజ వేయకుండా తన పర్యటనను యథావిధిగా కొనసాగించారు. అదే కాన్వాయ్‌తో కరీంనగర్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. యువత, నిరుద్యోగుల హక్కుల కోసం బీఆర్‌ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ప్రమాద వార్త తెలుసుకున్న పార్టీ శ్రేణులు ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
